సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 11 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల మార్కును దాటి అరుదైన ఘనత సాధించింది. తద్వారా తమిళ చిత్ర పరిశ్రమ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది. గతంలో రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ సినిమా పేరున ఉన్న ఎనిమిదేళ్ల రికార్డును ఈ చిత్రం అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని చేరుకున్న ఏడో దక్షిణాది చిత్రంగా, మొత్తంగా 18వ భారతీయ సినిమాగా నిలిచింది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.44 కోట్ల గ్రాస్ వసూలైంది. ఈ వేగంతో సినిమా త్వరలోనే రూ.900 కోట్ల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. విడుదలైన పదకొండో రోజు దేశవ్యాప్తంగా రూ.25.70 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టగా, దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ.398 కోట్లకు (రూ.466.85 కోట్ల గ్రాస్) చేరాయి. త్వరలోనే ఈ చిత్రం రూ.400 కోట్ల నెట్ క్లబ్లో చేరనుంది. గతంలో ‘జైలర్ 1’, విజయ్ నటించిన ‘లియో’ మాత్రమే తమిళనాట ఈ ఘనత సాధించాయి.
ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 11 రోజుల్లోనే విదేశాల్లో 25.6 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తాజా వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ రూ.710 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రూ.691 కోట్ల గ్రాస్‌తో అగ్రస్థానంలో ఉన్న ‘2.0’ రికార్డును తాజాగా ‘జైలర్ 2’ బద్దలుకొట్టి బాక్సాఫీస్ వద్ద నయా ట్రెండ్ సృష్టిస్తోంది.
Don’t receive OTP? Resend