హైదరాబాద్లో నీటి ఎద్దడి తలెత్తుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వదంతులపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) స్పందించింది. తమ సంస్థ పేరుతో ప్రచారంలో ఉన్న ఆ సందేశం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
వదంతులను నమ్మవద్దు
ఎల్నినో ప్రభావం, రాబోయే కరవు కారణంగా నవంబర్ చివరి నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయని, హైదరాబాద్లో నీటి సరఫరా పరిమితం అవుతుందని లేదా నిలిచిపోతుందని వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారాన్ని తాము జారీ చేయలేదని జలమండలి తేల్చిచెప్పింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆ సందేశంలో పేర్కొన్న వివరాలు ఏవీ అధికారికం కాదని వెల్లడించింది.
ప్రజలకు హెచ్చరిక
జలమండలి పేరుతో సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి నిర్ధరణ లేని సందేశాలను నగర ప్రజలు నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అటువంటి వదంతులను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం ఉన్నా నేరుగా తమ శాఖ ద్వారానే వెల్లడిస్తామని జలమండలి స్పష్టం చేసింది.
Don’t receive OTP? Resend