హైదరాబాద్‌లో నీట్ పీజీ పరీక్ష నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే కీలక జంక్షన్ల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లోని 4 ప్రధాన పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్యారడైజ్ సర్కిల్, కింగ్ కోఠి, తాజ్‌మహల్ జంక్షన్, బండ్లగూడ ప్రాంతాలతో పాటు రేతిబౌలి, నానల్‌నగర్, దుర్గానగర్, కేఎఫ్‌సీ జంక్షన్ల వద్ద రద్దీకి అవకాశం ఉందని తెలిపారు. ఉదయం నగరంలో హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్-2026 జరుగుతున్నందున, షేక్‌పేట్‌లోని జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజ్ పరీక్షా కేంద్రానికి వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
బోరబండ, కల్యాణ్‌నగర్, మధురానగర్, యూసుఫ్‌గూడ వైపు నుంచి వచ్చే విద్యార్థులు జూబ్లీహిల్స్ మీదుగా వెళ్లాలని చెప్పారు. సైబరాబాద్ వైపు నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా వచ్చేవారు రోడ్ నంబర్ 45-51 మార్గాన్ని ఉపయోగించాలని కోరారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్లు 14, 10, 12 నుంచి వచ్చే వారు అగ్రసేన్ ఐలాండ్-ఫిల్మ్‌నగర్ మార్గంలో వెళ్లాలని సూచించారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, రద్దీ ప్రాంతాలను వీలైనంత వరకు నివారించాలని పోలీసులు కోరారు. అత్యవసర ప్రయాణాలు లేదా సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend