గుంటూరు: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో ఇటీవల జరిగిన మహిళపై దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు, తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. బాధిత మహిళ గౌరవం, గోప్యతకు భంగం కలిగించేలా వీడియోలు షేర్ చేసినా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా, తప్పుడు సమాచారం ప్రచారం చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు.
ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 16న బాధిత మహిళ చికిత్స అనంతరం నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 331(6), 79, 115(2), 118(1)తో పాటు 3(5) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనలో పాల్గొన్న తొమ్మిది మంది నిందితులను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారని, అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించిందని ఎస్పీ తెలిపారు. కేసుకు సంబంధించి అవసరమైన అన్ని చట్టపరమైన ప్రక్రియలను చేపట్టినట్లు చెప్పారు.
ఘటన నిర్వహణలో లోపాలపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా నగరంపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంపై కూడా పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను షేర్ చేయడం వల్ల బాధిత మహిళ గౌరవం, వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వారిపై సమాచార సాంకేతిక చట్టంలోని (IT Act) సెక్షన్ 67 కింద క్రైమ్ నెం. 273/2026గా మరో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
సోషల్ మీడియా లేదా ఇతర వేదికల ద్వారా బాధిత మహిళపై అసత్య ప్రచారం చేయడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆమె గౌరవానికి భంగం కలిగించే వీడియోలు లేదా ఇతర కంటెంట్‌ను ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని ఎస్పీ హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend