భారత త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2.12 లక్షల కోట్ల వ్యయంతో సైనిక సామగ్రి కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
తేలికపాటి మల్టీరోల్ హెలికాప్టర్లు, దీర్ఘశ్రేణి ఆత్మాహుతి డ్రోన్లు, రాడార్లు వంటి వివిధ ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు డీఏసీ ఆమోదముద్ర వేసింది. ఈ మొత్తం కొనుగోళ్లలో దాదాపు 82 శాతం దేశీయంగానే చేపట్టాలని నిర్ణయించారు. ఇది దేశీయ రక్షణ తయారీ రంగానికి మరింత ఊతమివ్వనుంది.
భారత సైన్యం కోసం తేలికపాటి మల్టీరోల్ హెలికాప్టర్లు, అతి స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ, దీర్ఘశ్రేణి ఆత్మాహుతి డ్రోన్ల కొనుగోలుకు ఆమోదం లభించింది. నౌకాదళం కోసం యాక్టివ్ ఆఫ్బోర్డ్ డెకాయ్ సిస్టమ్ వంటి వ్యవస్థలను సమకూర్చుకోనున్నారు. శత్రువుల నౌకా విధ్వంసక క్షిపణుల నుంచి రక్షణ కల్పించడంలో ఏఓడీఎస్ వ్యవస్థ ఎంతగానో సాయపడుతుందని రక్షణశాఖ వెల్లడించింది.
Don’t receive OTP? Resend