ఆంధ్రప్రదేశ్ లో అర్నబ్ తుపాను ప్రభావం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, సముద్రంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్ర అలల తాకిడి తీవ్ర రూపం దాల్చింది.
ఉప్పాడ తీరంలో ఇటీవల నిర్మించిన ఎత్తైన రాళ్లగట్టును సైతం సముద్ర అలలు దాటుకుని విరుచుకుపడుతున్నాయి. ఈ ఉధృతి కారణంగా తీరం కోతకు గురైంది. భారీ ఎత్తున రాళ్లు బీచ్ రోడ్డుపైకి వచ్చి చేరడంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కవిటి, కంచిలి, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, గార, లావేరు, ఆమదాలవలస తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Don’t receive OTP? Resend