నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన తీవ్ర వరదల వల్ల ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది సభ్యులు గల్లంతయ్యారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కైలాస మానసరోవర్ యాత్ర ముగించుకుని తిరుగుపయనమైన సభ్యులు ఇమిగ్రేషన్ కేంద్రం వద్ద ఉండగా వరద ఉధృతికి ఆ భవనం కొట్టుకుపోయిందని తెలిపారు.
ప్రస్తుతం టిబెట్‌లోని సాగా క్యాంప్‌లో ఉన్న సద్గురు, వరద పీడిత ప్రాంతమైన గైరాంగ్ లో సహాయక చర్యలు చేపట్టేందుకు తమకు అనుమతి ఇవ్వాలని భారత్, చైనా అధికారులను అభ్యర్థించారు. వరదల కారణంగా అన్ని రవాణా మార్గాలు మూసుకుపోవడంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టతరంగా మారిందని పేర్కొన్నారు.
వరద తీవ్రత గురించి వివరిస్తూ, తాము ఉన్న బృందం భవనం పూర్తిగా కొట్టుకుపోయిందని, ఘటన జరిగిన కొద్దిసేపటికే ఈశా సభ్యుడు ఇషంగ ప్రవీణ్ నుంచి తమకు సమాచారం అందిందని జగ్గీ వాసుదేవ్ వెల్లడించారు. వారం క్రితం తాను కూడా అదే ఇమిగ్రేషన్ కేంద్రంలో ఉన్నానని, ఇంతలోనే ఇలాంటి పెద్ద విధ్వంసం జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేపాల్‌లో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది భారతీయుల ఆచూకీ లభ్యం కాకపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈశా ఫౌండేషన్ బృందంతో పాటు ఇతరులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి భారత్, చైనా ప్రభుత్వాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend