కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా బలహీనపడటంతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇంతకాలం అధికారానికి అలవాటు పడిన నేతలకు ప్రస్తుత ఎన్నికల పరిణామాలు మింగుడు పడడం లేదు. నామినేషన్ల నాడే కూటమి పార్టీలు 66 డివిజన్లకు గాను 52 చోట్ల ఏకగ్రీవం చేసుకోవడం వైకాపా వర్గాలను కలవరపెట్టింది. కూటమి నాయకులపై విమర్శలు చేస్తున్నప్పటికీ, అంతర్గతంగా పార్టీ పరిస్థితి మరీ ఇంత దిగజారడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోటీ పరిస్థితి
ఎన్నికల్లో కూటమిని ఎదుర్కోలేక వైకాపా నేతలు కాడి పడేశారంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం వైకాపా కేవలం 13 డివిజన్లలో మాత్రమే పోటీలో నిలిచింది. పార్టీకి పట్టున్న చిన్నచౌకు పరిధిలోని కొన్ని డివిజన్లలోనూ గట్టి పోటీ ఇచ్చేలా నేతలు చొరవ చూపడం లేదు. దీంతో బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులు నిస్సహాయులుగా మిగిలిపోయారు. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్లో పోరు ఏకపక్షంగా మారగా, మరికొన్ని చోట్ల అభ్యర్థులకు తీవ్రమైన ఎదురీత తప్పడం లేదు.
బూత్ నిర్వహణలో ఇబ్బందులు
నగరంలోని 66 డివిజన్ల పరిధిలో మొత్తం 361 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో పార్టీ తరఫున నలుగురు ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉండగా, ద్వితీయశ్రేణి నాయకులు ఆ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. బూత్ నిర్వహణ సమర్థంగా లేకపోవడం మేయర్ అభ్యర్థికీ భారీ నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అసలు మేయర్ ఎన్నికల బాధ్యతను ఎవరు చూస్తున్నారనే అంశంపైనే స్పష్టత లేకపోవడంతో కడప కార్పొరేషన్ పోరులో వైకాపా సత్తా చాటడం ప్రశ్నార్థకంగా మారింది.
Don’t receive OTP? Resend