ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి అనర్హత.. రాజకీయ భావజాలం ఒక్కటే అనర్హతకు కారణం కాదని స్పష్టీకరణ
లక్నో: ప్రస్తుత వ్యవస్థను మార్చాలంటూ హింసాత్మక మార్గాల్లో నిరసనలు, కార్యకలాపాలు చేపట్టే వారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో గట్టి నిబంధనలు విధించింది. ప్రభుత్వ శాఖల్లో ప్రత్యక్ష నియామకాల ద్వారా ఎంపికైన అభ్యర్థుల క్యారెక్టర్ వెరిఫికేషన్ మార్గదర్శకాలను సవరించింది.
హింసాత్మక మార్గాల ద్వారా ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థల్లో సభ్యులుగా ఉన్నవారిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణించనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు నియామకాలు, సిబ్బంది వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దేవరాజ్ అక్టోబర్ 28, బుధవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రస్తుత వ్యవస్థలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా హింసాత్మక మార్గాలను అనుసరించే సంస్థలతో సంబంధం ఉన్నట్లు తేలితే అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే, ఒక వ్యక్తికి ఉన్న రాజకీయ భావజాలం లేదా అభిప్రాయాలు మాత్రమే ఉద్యోగానికి అనర్హతగా పరిగణించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ప్రభుత్వ శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బోర్డులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లోని నియామకాలకు కూడా వర్తించనున్నాయి.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, 21 ఏళ్లు నిండిన తర్వాత క్యారెక్టర్ వెరిఫికేషన్ తేదీకి ముందు మూడేళ్ల కాలంలో అభ్యర్థి హింసాత్మక కార్యకలాపాల్లో లేదా ప్రస్తుత వ్యవస్థను మార్చే లక్ష్యంతో చేపట్టిన చర్యల్లో పాల్గొంటే, అతను ఇప్పటికీ అటువంటి కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు భావించే అవకాశం ఉంటుంది. అయితే, ఆ కాలంలో అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనా విధానంలో నిజమైన మార్పు వచ్చిందని నిరూపించే ఆధారాలను అధికారులు పరిశీలించవచ్చు.
మరోవైపు, తప్పుడు ఫిర్యాదుల కారణంగా అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేవలం ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన లేదా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నంత మాత్రాన అభ్యర్థిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించబోమని తెలిపింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో క్యారెక్టర్ వెరిఫికేషన్ పరిధిని విస్తరించడంతో పాటు, అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేసింది.
Don’t receive OTP? Resend