ఉద్యోగం కోల్పోతే 60 రోజుల గడువు రద్దుకు ప్రతిపాదన.. భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు కీలకమైన 60 రోజుల 'గ్రేస్ పీరియడ్'ను రద్దు చేసే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (OMB) పరిశీలనలో ఉంది. ఇది ఇంకా అమల్లోకి రాలేదని, తుది ఆమోదం పొందాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, హెచ్-1బీ ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా వీసా హోదా మార్చుకోవడానికి గరిష్ఠంగా 60 రోజుల గడువు ఉంటుంది. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన వెంటనే అమెరికా విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
అదే సమయంలో అమెరికాలో ఉండి కొత్త యజమానికి మారడం లేదా వీసా స్టేటస్ మార్చుకోవడం కూడా మరింత కష్టమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ మార్పు భారతీయ ఐటీ నిపుణులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గణాంకాల ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన హెచ్-1బీ వీసాల్లో సుమారు 71 శాతం భారతీయులకే లభించాయి. ప్రస్తుతం అమెరికాలో 52 లక్షలకు పైగా భారతీయ మూలాల ప్రజలు నివసిస్తున్నారు.
విదేశీ నైపుణ్య సిబ్బందికి ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొంత సమయం కల్పించేందుకు 2017లో ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ నిబంధనను తొలగించే ప్రతిపాదన ఇప్పుడు వలస నిపుణులు, టెక్ కంపెనీలు, విదేశీ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది. ప్రతిపాదనపై సమీక్ష పూర్తయ్యాకే తుది నిర్ణయం వెలువడనుంది.
Don’t receive OTP? Resend