రాఖీ పండుగతో పాటు వారాంతపు సెలవులు రావడంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పెద్దసంఖ్యలో సొంతూళ్లకు పయనమవ్వడంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది. పండుగను కుటుంబసభ్యులతో జరుపుకొనేందుకు జనం పండగ బాట పట్టడంతో జాతీయ రహదారి రద్దీగా మారింది.
నెమ్మదిగా సాగుతున్న వాహనాల రాకపోకలు
హైదరాబాద్ నగరం నుంచి ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలోని పలు జిల్లాలకు వెళ్లే వాహనాలు ఒక్కసారిగా రహదారిపైకి రావడంతో ప్రయాణం నెమ్మదించింది. చౌటుప్పల్, చిలుకూరు క్రాస్ రోడ్డు వంటి కీలక ప్రాంతాల్లో వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదులుతున్నాయి. సొంత వాహనాలు, బస్సులు అధిక సంఖ్యలో చేరడంతో రహదారిపై రద్దీ మరింత ఎక్కువైంది.
టోల్ ప్లాజాల వద్ద పోలీసుల చర్యలు
కీలకమైన టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ఓపికతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Don’t receive OTP? Resend