బూతులు తిట్టడం అశ్లీల నేరం కాదు: సుప్రీంకోర్టు
అసభ్య పదజాలంపై సుప్రీంకోర్టు కీలక వివరణ
న్యూఢిల్లీ: బూతులు మాట్లాడటం, అసభ్య పదజాలం ఉపయోగించడం లేదా తిట్టడం మాత్రమే చట్టపరంగా "అశ్లీలం" కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
అసభ్యత (Vulgarity), దూషణ (Abuse), బూతులు (Profanity) మరియు అశ్లీలత (Obscenity) ఒకటి కాదని స్పష్టం చేసింది.
అశ్లీలంగా పరిగణించాలంటే ఆ పదాలు లేదా చర్యలు లైంగిక ఉద్రేకాన్ని రేకెత్తించేలా ఉండాలని, కామప్రేరిత ఆసక్తిని పెంచాలని, వినేవారి లేదా చూసేవారి నైతిక విలువలను దెబ్బతీసే స్వభావం కలిగి ఉండాలని ధర్మాసనం పేర్కొంది.
2017లో తమిళనాడులో ఇద్దరు పొరుగువారి మధ్య వ్యవసాయ భూమి వివాదం సందర్భంగా జరిగిన వాగ్వాదానికి సంబంధించిన కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వాగ్వాదంలో ఒక వ్యక్తి తీవ్ర బూతులు తిట్టడంతో అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294(బి) కింద అశ్లీల ప్రవర్తన కేసు నమోదు చేశారు. అయితే కేవలం బూతులు మాట్లాడినంత మాత్రాన అది అశ్లీల నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చింది.
ఈ సందర్భంగా న్యాయస్థానం "కమ్యూనిటీ స్టాండర్డ్స్ టెస్ట్"ను ప్రస్తావించింది. ఒక పదం లేదా వ్యక్తీకరణ అశ్లీలమా కాదా అన్నది సమాజంలో ప్రస్తుత నైతిక ప్రమాణాలు, సందర్భం, ప్రదేశం, సంప్రదాయాలు, సామాజిక నేపథ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాల్సి ఉంటుందని వివరించింది. కేవలం అసహ్యం, విరక్తి లేదా షాక్ కలిగించడమే అశ్లీలతకు ప్రమాణం కాదని స్పష్టం చేసింది.
తీర్పులో భాగంగా జస్టిస్ సంజయ్ కరోల్ 'అబ్యూజివ్' (Abusive), 'వల్గర్' (Vulgar) అనే పదాలకు నిఘంటువుల్లో ఇచ్చిన నిర్వచనాలను కూడా ప్రస్తావించారు. 'అబ్యూజివ్' అంటే అత్యంత మొరటుగా, అవమానకరంగా మాట్లాడటం కాగా, 'వల్గర్' అంటే కోపం, అసహ్యం లేదా ఇబ్బంది కలిగించే అసభ్య పదజాలమని వివరించారు. అయితే ఈ రెండు లక్షణాలు ఉన్నంత మాత్రాన అవి చట్టపరంగా అశ్లీలంగా మారవని స్పష్టం చేశారు. అశ్లీలతగా పరిగణించాలంటే ఆ వ్యక్తీకరణ వల్ల కామప్రేరిత ఆలోచనలు రేకెత్తాలి లేదా ప్రజల నైతిక విలువలను భ్రష్టు పట్టించే ప్రభావం ఉండాలని పేర్కొన్నారు.
అలాగే, బహిరంగ ప్రదేశంలో అలాంటి పదజాలం ఇతరులకు నిజంగా ఇబ్బంది కలిగించిందని కూడా నిరూపించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. గతంలో రంజిత్ డి. ఉదేశి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, చంద్రకాంత్ కల్యాణ్దాస్ కాకోద్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుల్లో సుప్రీంకోర్టు వెల్లడించిన సూత్రాలను ఈ తీర్పులో మరోసారి ప్రస్తావించింది. కాలానుగుణంగా సమాజంలోని నైతిక ప్రమాణాలు మారుతుంటాయని, అందువల్ల అశ్లీలతను నిర్ణయించేటప్పుడు సమకాలీన సామాజిక విలువలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో అసభ్య పదజాలం, అశ్లీలత మధ్య ఉన్న చట్టపరమైన వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు మరింత స్పష్టంగా నిర్వచించినట్టయింది. భవిష్యత్తులో ఇలాంటి కేసుల విచారణకు ఈ తీర్పు కీలక మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Login
Comments (1)
amarnath
16 days agoఇదేందయ్యా ఇదీ.. అయితే ఎవరినైనా తిట్టేయ్యొచ్చు ఇక