చిన్నారుల్లో పెరుగుతున్న స్క్రీన్ టైమ్ - ఎంత ఉండాలి?
హైదరాబాద్: ఇంట్లో ఏడుస్తున్న చిన్నారికి ఆటబొమ్మ కంటే ముందు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? భోజనం చేయించాలంటే కార్టూన్ పెట్టాల్సిందేనా? పడుకునే వరకు రీల్స్, షార్ట్ వీడియోలు, గేమ్స్ చూస్తూనే ఉంటున్నారా? అయితే ఇది ఒక్క మీ ఇంటి సమస్య కాదు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న 'స్క్రీన్ టైమ్' ఇప్పుడు పెద్ద ప్రజారోగ్య సవాల్‌గా మారుతోంది.
తాజా అధ్యయనాల ప్రకారం భారతీయ పెద్దలు రోజుకు 4 నుంచి 7.4 గంటలు వ్యక్తిగత స్క్రీన్ల ముందే గడుపుతున్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఐదేళ్లలోపు పిల్లలు రోజుకు సగటున 2.2 గంటలు స్క్రీన్ చూస్తున్నారు. రెండేళ్లలోపు చిన్నారులు కూడా రోజుకు 1.2 గంటలు మొబైల్ లేదా టీవీ స్క్రీన్ ఎదుట గడుపుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) ప్రకారం రెండేళ్లలోపు పిల్లలకు అసలు స్క్రీన్ చూపించకూడదు.
పట్టణాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 9 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల్లో దాదాపు సగం మంది రోజుకు మూడు గంటలకు పైగా సోషల్ మీడియా, ఓటీటీలు, ఆన్లైన్ గేమింగ్‌కే కేటాయిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. కరోనా తర్వాత చౌకైన స్మార్ట్ఫోన్ల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
పిల్లలను ప్రశాంతంగా ఉంచడానికి, భోజనం చేయించడానికి లేదా ఏడుపు ఆపడానికి ఫోన్‌ను "డిజిటల్ ఆయా"గా ఉపయోగించడం ఇప్పుడు అనేక కుటుంబాల్లో సాధారణమైంది. కానీ దీని ప్రభావం పిల్లల మాటతీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, భావోద్వేగాలపై పడుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక స్క్రీన్ వినియోగం వల్ల చిరాకు, ఆందోళన, డిజిటల్ వ్యసనం, నిద్రలేమి, కంటి సమస్యలు, ఊబకాయం, మెడ నొప్పులు పెరుగుతున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
వయస్సు ప్రకారం ఎంత స్క్రీన్ టైమ్?
2 ఏళ్లలోపు: అసలు స్క్రీన్ వద్దు (వీడియో కాల్స్ మినహా)
2–5 ఏళ్లు: రోజుకు గరిష్ఠంగా 1 గంట
5–10 ఏళ్లు: రోజుకు 2 గంటలలోపు
పెద్దలు: పని అవసరాలను మినహాయించి వ్యక్తిగత వినియోగం 2 గంటలలోపు ఉంటే మంచిది.
స్క్రీన్ టైమ్ తగ్గించాలంటే...
భోజన సమయంలో, పడుకునే గంట ముందు ఇంట్లో "ఫోన్ ఫ్రీ జోన్" ఏర్పాటు చేయండి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలోని వస్తువును చూడే 20-20-20 నియమం పాటించండి. మొబైల్లో యాప్ టైమర్లు పెట్టండి. ఖాళీ సమయాన్ని పుస్తకాలు, బోర్డు గేమ్స్, బయట ఆటలు, కుటుంబ సభ్యులతో సంభాషణకు కేటాయించండి.
అత్యంత ముఖ్యంగా... పిల్లలకు చెప్పడం కంటే పెద్దలు ముందుగా ఫోన్ పక్కన పెట్టాలి. ఎందుకంటే పిల్లలు మనం చెప్పేది కంటే మనం చేసేదే ఎక్కువగా నేర్చుకుంటారు. ఒక ఫోన్ చేతిలోకి రావడానికి కొన్ని సెకన్లే పడుతుంది. కానీ దాని వల్ల జారిపోతున్న బాల్యాన్ని తిరిగి తీసుకురావడం అంత సులభం కాదు.
Login
Comments (0)