అమరావతిలో చంద్రబాబు తీసుకొచ్చిన జీవో-41 ఏంటి?
అమరావతి: అమరావతి ఎసైన్డ్ భూముల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి. నారాయణపై నమోదైన సీఐడీ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడంతో జీవో నంబర్ 41 (G.O. Ms. No. 41) మరోసారి చర్చనీయాంశమైంది. అసలు జీవో-41 ఎందుకు తీసుకొచ్చారు? దానిపై వివాదం ఎలా మొదలైంది? తర్వాత ఏం జరిగింది?
జీవో-41 ఎందుకు తీసుకొచ్చారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో-41ను జారీ చేసింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకంలో అసైన్డ్ భూముల రైతులకు కూడా లబ్ధి కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.
మొదట భూసమీకరణ పథకం కింద పట్టా భూముల యజమానులకు మాత్రమే అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లు ఇచ్చే నిబంధన ఉండేది. జీవో-41 ద్వారా ఆ నిబంధనలను సవరించి, ప్రభుత్వం గతంలో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల రైతులకు కూడా అదే తరహా ప్యాకేజీ వర్తించేలా చేశారు.
ఏం లబ్ధి కల్పించారు?
జీవో-41 ప్రకారం భూములు అప్పగించిన వారికి ఎకరాకు అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించారు.
- మెట్ట భూమికి: 1,000 చదరపు గజాల నివాస ప్లాటు, 200 చదరపు గజాల వాణిజ్య ప్లాటు.
- మాగాణి భూమికి: 1,450 చదరపు గజాల నివాస ప్లాటు, 250 చదరపు గజాల వాణిజ్య ప్లాటు
పేద రైతులు రాజధాని నిర్మాణంలో నష్టపోకుండా చూడడమే ఈ నిర్ణయం లక్ష్యమని అప్పటి ప్రభుత్వం తెలిపింది.
వివాదం ఎందుకు?
అయితే తర్వాత ఈ జీవోపై తీవ్ర రాజకీయ, న్యాయపరమైన వివాదాలు చెలరేగాయి.
వైసీపీ ప్రభుత్వం ఆరోపించిన ప్రకారం, రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగానే తెలుసుకున్న కొందరు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ దళారులు దళితులు, బీసీలు తదితర పేద రైతుల నుంచి అసైన్డ్ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. అనంతరం జీవో-41 ద్వారా ఆ భూములను ల్యాండ్ పూలింగ్‌లో చేర్చి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి చేసిన ప్లాట్లు పొందారని సీఐడీ కేసు నమోదు చేసింది.
అసైన్డ్ భూముల బదలాయింపును నిషేధించే 1977 అసైన్డ్ ల్యాండ్స్ చట్టం ఉల్లంఘించబడిందని కూడా ఆరోపించింది.
ప్రభుత్వం మారిన తర్వాత...
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో-316 జారీ చేసి, థర్డ్ పార్టీ కొనుగోలుదారులకు జీవో-41 కింద కేటాయించిన ప్లాట్లను రద్దు చేసింది. అభివృద్ధి చేసిన ప్లాట్లు 2014 రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసలు అసైన్డ్ రైతులకే ఇవ్వాలని నిర్ణయించింది.
అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది.
హైకోర్టు ఏమంది?
ఇటీవల ఇచ్చిన తీర్పులో హైకోర్టు జీవో-41 ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం అని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాలను క్రిమినల్ నేరాలుగా పరిగణించలేమని పేర్కొంది.
చంద్రబాబు, నారాయణపై నేర ఉద్దేశం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సీఐడీ నమోదు చేసిన కేసు రాజకీయ ప్రతీకారంతో కూడుకున్నదేనని వ్యాఖ్యానించింది. విధాన నిర్ణయాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తూ కేసును కొట్టివేసింది.
అయితే, జీవో-41 కింద జరిగిన భూముల కేటాయింపులు, తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దాఖలైన ఇతర పిటిషన్లు మాత్రం వేర్వేరుగా న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయి.
Login
Comments (0)