నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవ ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుచుకుందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పత్రాలు ఉపయోగించాలంటూ కాంగ్రెస్ పార్టీ నిరంతరం డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాల్లో కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ ఆ పార్టీ ఓటమి చవిచూడగా, భాజపా మూడు, జేడీఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బిహార్లో కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.
ఉత్తర్ప్రదేశ్లో ఇప్పటివరకు భాజపా అయిదు, సమాజ్వాదీ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రతిపక్ష ఎన్సీపీ రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఎన్నికల్లో బ్యాలెట్ విధానం అమలైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడంపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Don’t receive OTP? Resend