కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న స్టింగ్ ఆపరేషన్ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వీడియోల వ్యవహారంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి కృపా ఆల్వాను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. ఈ మేరకు కేపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.నారాయణస్వామి అధికారికంగా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు.
గత నెలలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించి కొన్ని వివాదాస్పద వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తన పరువుకు నష్టం కలిగించేలా రూపొందించిన ఆ వీడియోల వెనుక కృపా ఆల్వా హస్తం ఉందని సిద్ధరామయ్య తీవ్రంగా ఆరోపించారు. ఆ నిజానిజాలు నిగ్గు తేలేవరకు వాటిని ఎలాంటి మీడియా సంస్థలు ప్రసారం చేయకూడదని ఆయన కోర్టు నుంచి ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు.
ఈ స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో ప్రమేయం ఉందన్న తీవ్ర ఆరోపణలపై వివరణ కోరుతూ పార్టీ అధిష్టానం ఇప్పటికే కృపా ఆల్వాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై ఆమె స్పందించకపోవడం, ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు తాజా క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు ఈ స్టింగ్ ఆపరేషన్‌పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇందులోని లైంగిక వేధింపుల ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవని ప్రాథమికంగా తేల్చగా, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.
Don’t receive OTP? Resend