పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి వినూత్న రీతిలో వార్తల్లో నిలిచింది. ఖాళీగా ఉన్న ఫీల్డింగ్ కోచ్ పదవి భర్తీ కోసం ఏకంగా ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్లో ఓపెన్ హైరింగ్ ప్రారంభించడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాక్ బోర్డు ఎంచుకున్న ఈ వింత విధానంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను పీసీబీ తొలగించింది. అలాగే ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పంపింది. మొన్నటివరకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన షేన్ మెక్‌డెర్మాట్ పదవీకాలం జులై నెలలోనే ముగిసింది. ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో పీసీబీ దరఖాస్తులు ఆహ్వానించింది.
అయితే కోచ్ నియామకానికి సాంప్రదాయ పద్ధతులు కాకుండా లింక్డ్ఇన్ను ఆశ్రయించడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పీసీబీలో ఉద్యోగాల భర్తీ పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరుగుతుందా లేక సిఫార్సులు పనిచేస్తాయా అని ఓ యూజర్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ పదవికి దరఖాస్తు చేస్తానని, గతంలో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగంలో పనిచేశానని మరో నెటిజన్ కామెంట్ చేశారు. రెండు క్యాచ్‌లు డ్రాప్ చేశానని, ఈ పదవికి తాను ఆసక్తిగా ఉన్నానంటూ కొందరు సరదాగా సెటైర్లు పేల్చారు.
Don’t receive OTP? Resend