ప్రొద్దుటూరు: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ 2.0–అమరజీవి జలధార పనులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లిలో పైలాన్‌ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.30,156 కోట్ల వ్యయంతో మరో 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. ఇందులో భాగంగా 13,075 ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు, 24,601 ఆవాసాలకు నీటి సరఫరా విస్తరణ, 77,243 కిలోమీటర్ల పైప్‌లైన్ నెట్వర్క్ నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో మొత్తం 61.60 లక్షల కుళాయి కనెక్షన్లకు మెరుగైన తాగునీటి సరఫరా అందుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు 3.3 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందుతుందని చంద్రబాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 లక్షల కుటుంబాల్లో ఇప్పటికే దాదాపు 62 లక్షల కుటుంబాలకు ఇంటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. జల్ జీవన్ మిషన్–2.0 కింద మరో 27 లక్షల కుటుంబాలకు నీటి సదుపాయం కల్పించడమే లక్ష్యమన్నారు.
ఇంటింటికీ కుళాయి నీరు అందుబాటులోకి రావడం వల్ల ముఖ్యంగా మహిళలకు నీటి కోసం వెచ్చించే సమయం, శ్రమ, ఖర్చు తగ్గుతాయని సీఎం పేర్కొన్నారు. సురక్షితమైన తాగునీటి అందుబాటుతో ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. శాశ్వత నీటి వనరుల నుంచి ప్రజలకు తాగునీరు అందించడమే జల్ జీవన్ మిషన్ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
గ్రామీణ మౌలిక వసతులపై దృష్టి
గతంలో జల్ జీవన్ మిషన్ అమలులో లోపాలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం నుంచి భారీగా నిధులు పొందిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గత ప్రభుత్వం ఏపీలో ఈ పథకానికి కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే వినియోగించిందని పేర్కొన్నారు.
తాగునీటితో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పల్లె పండుగ–3.0 ద్వారా రూ.11,085 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, పంట కుంటలు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలో గ్రామీణ మౌలిక వసతుల కోసం రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రానికి, రాయలసీమకు జల భద్రత
తాగునీటితో పాటు సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా నీటి నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చంద్రబాబు తెలిపారు. గత రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ద్వారా నీటిని వినియోగంలోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాజెక్టులకు తేదీలతో కూడిన క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు తెలిపారు.
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో కరవు సమస్యను తగ్గించవచ్చన్నారు.
కరవు పరిస్థితుల్లోనూ 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని చంద్రబాబు తెలిపారు. కనీసం 200 టీఎంసీల గోదావరి వరద జలాలను వినియోగించుకుంటే రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చన్నారు.
హంద్రీ–నీవా ఫేజ్–1ను పూర్తి చేసి రాయలసీమలోని రిజర్వాయర్లను నింపామని, వెలిగొండ ఫేజ్–1 ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తీసుకెళ్లామని వివరించారు.
రాయలసీమ ఆర్థిక, వ్యవసాయ రంగాల రూపురేఖలను మార్చేలా రూ.1 లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు.
Don’t receive OTP? Resend