ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలకు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 10,262 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 99.36 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
రాష్ట్రంలో మొత్తం 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే అధికార కూటమి గణనీయమైన ఆధిపత్యం సాధించింది. మొత్తం 17 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఛైర్పర్సన్ స్థానాలతో పాటు ఎనిమిది చోట్ల అన్ని వార్డులను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా అయిన వైఎస్సార్ కడపలోనూ ఆరు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్పర్సన్ పోస్టులతో పాటు, కడప నగరపాలక సంస్థలో 66 డివిజన్లకు గాను 52 స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకోవడం విశేషం. దీంతో రాయలసీమ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో వైకాపాకు అభ్యర్థుల కొరత ఏర్పడినట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పక్షాలు సర్వశక్తులూ ఒడ్డామ. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ వైకాపాను పూర్తిగా దెబ్బతీయాలని అధికార కూటమి పట్టుదలగా ఉంది. మరోవైపు గత ఎన్నికల పరాభవం నుంచి కోలుకుని తమ ఉనికిని చాటుకోవాలని వైకాపా తీవ్రంగా శ్రమిస్తోంది. విజయవాడ, చీరాల, నెల్లిమర్ల, సాలూరు సహా పలు ప్రాంతాల్లో మేయర్, ఛైర్పర్సన్ స్థానాలకు హోరాహోరీ త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు పోటాపోటీగా నగదు పంపిణీ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Don’t receive OTP? Resend