ప్రాథమిక అంచనా వెల్లడించిన సీఎం చంద్రబాబు.. విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ నుంచి 1,000 మంది సిబ్బంది.. అవసరమైతే మరో 2,000 మందిని రప్పిస్తామని ప్రకటన
అమరావతి: ఆర్నబ్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం ఆయన కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు.
అనంతరం ముమ్మిడివరం మండలం గచ్చకాయలపోర గ్రామంలో వరద బాధితులతో మాట్లాడారు. తుపాను ముందస్తు సన్నద్ధత వల్ల ప్రాణనష్టాన్ని పరిమితం చేయగలిగామని, అయినప్పటికీ ఏడుగురు మృతి చెందారని చంద్రబాబు చెప్పారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 1,000 మంది సిబ్బందిని పంపించాలని కోరినట్లు వెల్లడించారు. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మరో 2,000 మంది సిబ్బందిని కూడా రప్పిస్తామని చెప్పారు.
ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. శనివారం నాటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే కనీసం 8,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని చంద్రబాబు తెలిపారు. తుపాను కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణతో పాటు బాధితులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
Don’t receive OTP? Resend