మొదటి ప్రయత్నంలోనే తెలుగు యువకుల అంతరిక్ష చరిత్ర!
హైదరాబాద్: ఒకరు హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన బాలుడు. చిన్నప్పుడు గణితంలో 100కు 51 మార్కులే వచ్చాయి. మరొకరు తిరుపతి, విశాఖపట్నం వీధుల్లో పెరిగి IITలో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన విద్యార్థి. ఇద్దరూ ఇస్రోలో ఉద్యోగాలు చేశారు. కానీ, సురక్షితమైన ఉద్యోగాలను వదిలి ఒక పెద్ద కల కోసం అడుగులు వేశారు. ఎనిమిదేళ్ల తర్వాత ఆ కల 'విక్రమ్-1' రూపంలో భారత అంతరిక్ష చరిత్రలో నిలిచిపోయింది.
ఆ ఇద్దరు పవన్ కుమార్ చంద్రన,నాగ భరత్ డాకా. వారి వయసు 35 ఏళ్లు.
శనివారం హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయాణం ప్రారంభించి, తన పేలోడ్లను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది కేవలం ఒక రాకెట్ ప్రయోగం కాదు... భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ప్రపంచ వేదికపై అడుగుపెట్టిన క్షణం.
అంతరిక్ష నిపుణులు దీనిని "టెక్స్ట్‌బుక్ లాంచ్"గా అభివర్ణిస్తున్నారు. కౌంట్‌డౌన్ నుంచి ఉపగ్రహాల కక్ష్య ప్రవేశం వరకు ప్రతి దశ ప్రణాళిక ప్రకారమే సాగింది. తొలి ప్రయోగాల్లో కనిపించే సాంకేతిక లోపాలకు తావివ్వకుండా స్కైరూట్ బృందం మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ విజయంతో ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ప్రపంచంలోని మూడు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఒకప్పుడు ప్రభుత్వ సంస్థలకే పరిమితమైన అంతరిక్ష రంగంలో, ఇప్పుడు భారత స్టార్టప్‌లు కూడా ప్రపంచ వాణిజ్య ప్రయోగ మార్కెట్లో పోటీ పడగలవని స్కైరూట్ నిరూపించింది.
ఈ విజయానికి వెనుక ఉన్నవారు పవన్ కుమార్ చంద్రన మరియు నాగ భరత్ డాకా. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్‌లలో చదివిన వీరిద్దరూ ఇస్రోలో రాకెట్ సాంకేతికతపై పనిచేశారు. అక్కడి అనుభవాన్ని స్టార్టప్‌గా మార్చి 2018లో హైదరాబాద్‌లో స్కైరూట్‌ను ప్రారంభించారు. నేడు అదే సంస్థ 11 విడతల్లో 160 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించి, 1.1 బిలియన్ డాలర్ల విలువతో భారత తొలి స్పేస్‌టెక్ యూనికార్న్ గా ఎదిగింది.
సుమారు ఏడు అంతస్తుల ఎత్తు, నాలుగు దశలు, పూర్తిగా కార్బన్-కాంపోజిట్ నిర్మాణంతో రూపొందిన విక్రమ్-1, 350 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను ప్రత్యేకంగా కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు రూపొందించబడింది. తొలి ప్రయోగంలో జర్మనీతో పాటు భారతీయ స్టార్టప్‌ల పేలోడ్లను విజయవంతంగా అంతరిక్షంలోకి చేర్చింది.
2022లో విక్రమ్-ఎస్ తో తొలి అడుగు వేసిన స్కైరూట్, ఇప్పుడు విక్రమ్-1తో భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన అంతరిక్ష రంగ సంస్కరణలు, ప్రైవేట్ రంగానికి ఇచ్చిన అవకాశాలు, యువ ఇంజినీర్ల సాహసం కలిస్తే ప్రపంచ స్థాయి విజయాలు సాధించవచ్చని ఈ మిషన్ మరోసారి చాటిచెప్పింది.
హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇద్దరు యువ శాస్త్రవేత్తల ప్రయాణం... ఇప్పుడు భారత జెండాను అంతరిక్ష వాణిజ్య రంగంలో మరింత ఎత్తుకు తీసుకెళ్లే కొత్త యుగానికి నాంది పలికింది.
Login
Comments (0)