యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ప్రవాస భారతీయులను అనధికారిక ఏజెంట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వీసా క్రమబద్ధీకరణ, అత్యవసర ధ్రువపత్రాలు, ఎగ్జిట్ పర్మిట్లు, ఎమిరేట్స్ ఐడీలు మరియు ఉపాధి విషయంలో సహాయం చేస్తామంటూ నమ్మబలికే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా బ్లూకాలర్ ఉద్యోగులు నకిలీ ఏజెంట్ల బారినపడి నష్టపోతున్న ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ హెచ్చరిక జారీ చేసింది.
నకిలీ ఏజెంట్లు బాధితుల అనుమతి లేకుండా బయోమెట్రిక్ డేటాను సేకరించి, దానిని ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు నివేదికలు వచ్చాయి. బాధితుల ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలు తెరవడం, రుణాలు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు పొందడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఎగ్జిట్ పర్మిట్స్, ఎమిరేట్స్ ఐడీలు, వీసా క్రమబద్ధీకరణ కోసం బయోమెట్రిక్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉన్న భారతీయులు ఆ వివరాలన్నీ కేవలం యూఏఈ ప్రభుత్వ కేంద్రాలు లేదా అధికారిక కౌంటర్లలో మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది.
భారత పాస్‌పోర్టులు లేదా అత్యవసర ధ్రువపత్రాలను జారీ చేసేందుకు దుబాయ్, అబుధాబిలోని రాయబార కార్యాలయాలు ఎప్పుడూ ఫింగర్‌ప్రింట్, ఫేస్, ఐ స్కాన్లను తీసుకోవడం లేదని ఎంబసీ స్పష్టం చేసింది. రాయబార కార్యాలయం పేరుతో బయోమెట్రిక్ డేటాను అడిగే ఏజెంట్లను నమ్మవద్దని పేర్కొంది. మోసాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 80046342, వాట్సప్ లేదా ఎస్ఎంఎస్ నంబర్ 00971543090571, లేదా pbsk.dubai@mea.gov.in ద్వారా ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రాన్ని సంప్రదించి వివరాలు సరిచూసుకోవాలని సూచించింది.
Don’t receive OTP? Resend