తమ్మినేని కుటుంబం పరారీలో.. పోలీసుల గాలింపు
శ్రీకాకుళం: రూ.4 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు కుట్ర పన్నిన కేసులో నిందితులుగా ఉన్న మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
బతికి ఉన్న అసలు భూ యజమానిని మరణించినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఒడిశాకు చెందిన ఓ మహిళను ఏకైక వారసురాలిగా చూపించి భూమిని అక్రమంగా తమ కుమారుడు చిరంజీవి పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో తమ్మినేని కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు తేలడంతో వారిని నిందితులుగా చేర్చారు.
బతికివున్న 900 గజాల స్థల యజమాని అంధవరపు గోవిందరాజులు చనిపోయినట్టు డాక్యుమెంట్లు సృష్టించి ఒరిస్సాకు చెందిన అడబాల రజనిని వారసురాలిగా చూపించారు. ఆమె నుంచి తమ్మినేని సీతారం కొనుగోలు చేసినట్టు రిజిస్టర్ చేయించారు. అడబాల రజని ఏ1 గా, తమ్మినేని చిరంజీవిని ఏ5 గా, తమ్మినేని సీతారాం ఏ6గా, తమ్మినేని వాణి ఏ7గా కేసు నమోదైంది.
పోలీసులు వచ్చేలోపే ఇంటి నుంచి వెళ్లిపోయిన కుటుంబం
ఆమదాలవలసలో అద్దె ఇంట్లో ఉంటున్న తమ్మినేని కుటుంబం సోమవారం తెల్లవారుజామున అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి వద్ద రెండు సొంత కార్లు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించకుండా ప్రైవేటు ఇన్నోవా వాహనాన్ని రప్పించుకుని వెళ్లినట్లు సమాచారం. తమ మొబైల్ ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. అరెస్టు తప్పదని భావించి పోలీసుల కళ్లుగప్పి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. అయితే వారి ఆచూకీపై పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
13 మందిపై కేసు.. ఎనిమిది మంది అరెస్ట్
ఈ భూకబ్జా కుట్ర కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు కాగా, ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న వారిలో తమ్మినేని కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులతో పాటు మాజీ హోంగార్డు త్రినాథ్, మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. హిరమండలం సబ్-రిజిస్ట్రార్ పేరు కూడా కేసులో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
అరెస్టులో జాప్యంపై విమర్శలు
తమ్మినేని కుటుంబ సభ్యులు ఆమదాలవలసలోనే ఉన్నారని తెలిసినా వెంటనే అరెస్టు చేయకుండా పోలీసులు న్యాయసలహా కోసం వేచి చూశారని, అదే సమయంలో నిందితులు తప్పించుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు అధికారికంగా స్పందించలేదు.
నకిలీ రిజిస్ట్రేషన్ల ముఠాపై దర్యాప్తు
దర్యాప్తులో మాజీ హోంగార్డు త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, సాలిపల్లి లక్ష్మణరావు, రజని, డాక్యుమెంట్ రైటర్ కూన పెద్దిరాజులు కలిసి నకిలీ పత్రాలతో అనేక భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా గతంలో కూడా ఇదే తరహాలో మరిన్ని భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ్మినేని కుటుంబం కొనుగోలు చేసిన భూముల్లో ఇలాంటి నకిలీ రిజిస్ట్రేషన్లు జరిగాయా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కళాశాల ఉద్యోగులు కూడా కేసులో
తమ్మినేని కుటుంబానికి చెందిన కళాశాలలో పనిచేస్తున్న ఉపేంద్ర కుమార్, ఉపేంద్రరావు, సాంబశివరావు, గోపాలకృష్ణ నకిలీ పత్రాల ఆధారంగా జరిగిన రిజిస్ట్రేషన్లకు సాక్షులుగా సంతకాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారణంగా వారిని కూడా కేసులో నిందితులుగా చేర్చినట్లు సమాచారం.
గతంలోనూ భూకబ్జా ఆరోపణలు
తమ్మినేని సీతారాంపై గతంలోనూ పలు భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆమదాలవలసలోని టీఎస్ఆర్ కళాశాలకు ఆనుకుని ఉన్న ఎనిమిది సెంట్ల స్థలాన్ని తమ్మినేని కుటుంబం ఆక్రమించిందని ఓ వృద్ధ దంపతులు ముఖ్యమంత్రి ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించి ఆ స్థలాన్ని బాధితులకు అప్పగించారు.
అదేవిధంగా, టెక్కలి మండలం చింతామణి గ్రామంలో 23 ఎకరాల భూమిని తన కుమారుడి పేరుతో బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలు కూడా గతంలో వెలుగులోకి వచ్చాయి. ఆమదాలవలసలో కుటుంబానికి సన్నిహితుడైన వ్యక్తి మరణించిన తర్వాత ఆయన ఇంటిని తమ్మినేని భార్య వాణి స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే, అనారోగ్యంతో మరణించిన ఓ పోలీసు కానిస్టేబుల్ కుటుంబాన్ని అప్పుల పేరుతో బెదిరించి రైల్వే స్టేషన్ సమీపంలోని ఇంటిని తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అయితే ఈ ఆరోపణలపై తమ్మినేని సీతారాం లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ప్రస్తుతం నమోదైన భూకబ్జా కుట్ర కేసుతో పాటు ఇతర భూముల లావాదేవీలపైనా పోలీసులు దర్యాప్తు విస్తరించినట్లు తెలుస్తోంది.
Login
Comments (0)