అమరావతి: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై వచ్చిన ప్రాణహాని, కిడ్నాప్ యత్నం ఆరోపణలపై చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త, అమరావతి జెఏసి కన్వీనర్ గా ఉన్న మాదల శ్రీనివాసు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఈ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
మాదల శ్రీనివాసు తన పిటిషన్లో.. రఘురామకృష్ణరాజు తనపై కక్షతో వ్యవహరిస్తున్నారని, ఆయన పంపిన వ్యక్తులు జూలై 31న గుంటూరులోని తన నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి తనను బెదిరించారని, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ 2+2 పోలీసు భద్రత కల్పించాలని కూడా హైకోర్టును కోరారు.
ఇండ్-భారత్ పవర్ కంపెనీ వివాదం
ఈ ఫిర్యాదు వెనుక ఇండ్-భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ వ్యవహారం ప్రధాన కారణంగా ఉంది. రఘురామకృష్ణరాజు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 189 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ దివాలా ప్రక్రియలోకి వెళ్లింది. అనంతరం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) నిర్వహించిన ఈ-వేలంలో మాదల శ్రీనివాసుకు చెందిన అగతా ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.101.42 కోట్లకు ఆ ఆస్తిని దక్కించుకుంది.
ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తమకు అందిన పాత ఫైళ్లు, కంపెనీకి సంబంధించిన రికార్డులు, ఆర్థిక లావాదేవీలపై వివాదం కొనసాగుతోందని శ్రీనివాసు వాదిస్తున్నారు. వీటికి సంబంధించే తనపై బెదిరింపులు, కిడ్నాప్ యత్నం జరిగాయని ఆయన మూడు వారాల క్రితం ప్రెస్ లో ఆరోపించారు. తమ ఇంటికి రఘురామ పంపించారని చెబుతున్న కొంతమంది మనుషులు వచ్చారని ఆయన అప్పట్లో పోలీసులకి ఫిర్యాదు చేశారు.
పోలీసులకు కోర్టు కీలక ఆదేశాలు
శ్రీనివాసు ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రఘురామకృష్ణరాజు తన మీదకు మనుషులను పంపినట్లు సూచించే ఆధారాలు ఉంటే వాటిని సమర్పించాలని పిటిషనర్‌ను కూడా కోర్టు కోరింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.
ఆరోపణలకు తగిన ఆధారాలు లభిస్తే చట్టప్రకారం కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.
Don’t receive OTP? Resend