శ్రీవారి నిత్యహారతులపై కర్ణాటక వివాదం
డీకే శివకుమార్ వ్యాఖ్యలపై చర్చ.. తిరుమల నిత్యహారతుల్లో మంత్రులకు అవకాశం లేదంటున్న టీటీడీ వర్గాలు
తిరుమల: శ్రీవారి నిత్యహారతుల్లో కర్ణాటక ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే తిరుమల సంప్రదాయాల ప్రకారం ఏ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులకు నిత్యహారతుల్లో పాల్గొనే ప్రత్యేక అవకాశం లేదని టీటీడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
తిరుమలలో ప్రతిరోజూ తొలి గంట సేవలో భాగంగా శ్రీవారికి 21 నిత్యహారతులు సమర్పిస్తారు. ఇందులో 20 మఠాలతో పాటు మైసూరు సంస్థానానికి ఒక నిత్యహారతి సమర్పించే సంప్రదాయం ఉంది. ఆయా మఠాలు, సంస్థానాల ప్రతినిధులు ప్రతి ఏడాది డిసెంబరులో ముగ్గురు పేర్లను టీటీడీకి పంపిస్తారు. టీటీడీ ఆమోదించిన ఆ జాబితాలోని ఒక్క ప్రతినిధి మాత్రమే ఆయా రోజు నిత్యహారతిలో పాల్గొంటారు. మైసూరు సంస్థానం తరఫున సాధారణంగా తిరుమలలోని కర్ణాటక సత్రం ప్రతినిధులే హాజరవుతారు.
ఈ సంప్రదాయం మైసూరు మహారాజు తిరుమల ఆలయ అభివృద్ధికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాల కోసం అనేక వాహనాలు, ప్రత్యేక పల్లకిని మైసూరు సంస్థానం సమర్పించింది. అలాగే నవనీత హారతి, బ్రహ్మదీపాలకు నెయ్యి సమర్పించడం, కొన్ని ప్రత్యేక ఉత్సవాల్లో మైసూరు మహారాజు పేరుతో హారతి ఇవ్వడం వంటి ఆచారాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కర్ణాటక మంత్రులు లేదా ప్రజాప్రతినిధులు నిత్యహారతుల్లో పాల్గొనే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు సంప్రదాయానికి విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి డీకే శివకుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైసూరు సంస్థానానికి లభిస్తున్న గౌరవాన్ని రాజకీయ నాయకులతో ముడిపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని టీటీడీ బోర్డు సమావేశంలో ప్రస్తావిస్తానని తెలిపారు.
Login
Comments (0)