సీజేపీ నిరసనకారుల కోసం దేశం నలుమూలల నుంచి ఫుడ్ ఆర్డర్లు
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో విద్యార్థుల మద్దతుతో కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనకు దేశవ్యాప్తంగా ప్రజలు వినూత్నంగా సంఘీభావం తెలుపుతున్నారు. నిరసనకారులకు ఆహారం అందించేందుకు దేశం నలుమూలలతో పాటు విదేశాల్లోని భారతీయులు కూడా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున ఆర్డర్లు చేస్తున్నారు.
ఆర్డర్లు విపరీతంగా పెరగడంతో, "ఇకపై ఆహార పదార్థాలు పంపవద్దు. ఇప్పటికే తగినంత ఆహారం అందింది" అంటూ సీజేపీ నిర్వాహకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ఉదయం నుంచి జంతర్‌మంతర్ వద్ద పిజ్జాలు, బర్గర్లు, మోమోలు, థాలీలు, సమోసాలు, టీ వంటి ఆహార పదార్థాలతో డెలివరీ బాయ్స్ వరుసగా చేరుకున్నారు. ఫుడ్ డెలివరీ యాప్‌లలో చిరునామాగా "జంతర్‌మంతర్ ప్రొటెస్ట్ సైట్" మాత్రమే నమోదు చేసి, "నిరసనకారులకు అందజేయండి" అని సూచనలు ఇస్తున్నట్లు డెలివరీ సిబ్బంది తెలిపారు.
ఒక డెలివరీ సంస్థకు చెందిన యువకుడు మాట్లాడుతూ, మంగళవారం ఒక్కరోజే దాదాపు 20 సార్లు జంతర్‌మంతర్‌కు వచ్చానని, అందులో నాలుగు ఆర్డర్లు అమెరికా నుంచి వచ్చినవని తెలిపాడు. ఒకే ఆర్డర్లో 80 పిజ్జాలు కూడా పంపించారని, ఆర్డర్ల సంఖ్య ఎక్కువ కావడంతో తమ మేనేజర్ కూడా స్వయంగా డెలివరీకి రావాల్సి వచ్చిందని వివరించాడు.
బెంగళూరులో నర్సింగ్ చదువుతున్న బిహార్‌కు చెందిన ఓ విద్యార్థి తన పేరును వెల్లడించకుండా స్పందిస్తూ, తాను గతంలో నీట్ పరీక్ష రాసినప్పుడు కూడా ప్రశ్నపత్రం లీక్ కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపాడు. ప్రస్తుతం నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నందున విద్యార్థులకు మద్దతుగా పిజ్జాలు పంపించినట్లు చెప్పాడు.
మరో డెలివరీ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ, తనకు 10 కప్పుల టీ నుంచి 34 బర్గర్లు, 200 సమోసాల వరకు వివిధ రకాల ఆర్డర్లు వచ్చాయని తెలిపాడు. కొందరు ఆహారం పంపించినట్లు ఫొటోలు, వీడియోలు పంపాలని కోరుతున్నారని, మరికొందరు నిరసన శిబిరంలోకి వెళ్లి స్వయంగా పంపిణీ చేయాలని సూచిస్తున్నారని వివరించాడు.
నిరసనకారులకు వస్తున్న ప్రజా మద్దతు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో, ఇప్పటికే అవసరమైన ఆహారం అందుబాటులో ఉందని సీజేపీ తెలిపింది. మరిన్ని ఫుడ్ ఆర్డర్లు పంపకుండా, ఇతర మార్గాల్లో సంఘీభావం తెలియజేయాలని ప్రజలను కోరింది.
Login
Comments (0)