65 సెంట్ల భూమి స్వాధీనం.. హైకోర్టు వ్యాజ్యాల కొట్టివేతతో మార్గం సుగమం.. ఆగస్టు 13న సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం
అమరావతి: రాజధాని అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. తాడేపల్లి మండలం మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం సమీపంలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యకు హైకోర్టు తీర్పుతో పరిష్కారం లభించింది.
దీంతో మంగళవారం సాయంత్రం నుంచే రోడ్డు పనులను వేగవంతం చేశారు.
సీడ్ యాక్సెస్ రోడ్డులో దొండపాడు నుంచి ఉండవల్లి వరకు ఇప్పటికే 18.27 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. అయితే మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం సమీపంలో ఒక రైతుకు చెందిన 65 సెంట్ల భూమి అందుబాటులోకి రాకపోవడంతో రహదారి పనులకు అంతరాయం ఏర్పడింది. ఈ భూభాగాన్ని తప్పించేందుకు రోడ్డును వంపు తిప్పి నిర్మించాల్సి వచ్చింది.
మరోవైపు ఈ ప్రాంతంలో రెండు స్టీల్ వంతెనల నిర్మాణం పూర్తయినప్పటికీ రహదారిని మలుపు తిప్పడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వేగంగా వచ్చే వాహనాలు ఒక్కసారిగా మలుపు తీసుకోవాల్సి రావడంతో ప్రమాదాలకూ అవకాశం ఏర్పడింది.
పెనుమాక రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 39/2సీలో చోడిశెట్టి నిర్మలతకు చెందిన 65 సెంట్ల భూమి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ ప్రాంతంలో ఉంది. భూసమీకరణకు భూమిని ఇవ్వకపోవడంతో ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ చేపట్టింది.
భూసేకరణకు సంబంధించిన ప్రకటన జారీ చేసి అవార్డు పాస్ చేసిన ప్రభుత్వం రూ.1,43,28,157 పరిహారం నిర్ణయించింది. అయితే పరిహారం తీసుకునేందుకు నిర్మలత నిరాకరించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరికొందరు రైతులు కూడా భూసేకరణ అవార్డుపై కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం వ్యాజ్యాలను కొట్టివేయడంతో భూసేకరణకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
పరిహారం మొత్తాన్ని ఇప్పటికే ఆర్అండ్ఆర్ న్యాయస్థానంలో జమ చేసినందున, సీఆర్డీఏ అధికారులు భూమిని వెంటనే స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, చిన్నికృష్ణ ఆధ్వర్యంలో అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని ఏడీసీఎల్ అధికారులకు అప్పగించారు.
భూమి అందుబాటులోకి వచ్చిన వెంటనే ఏడీసీఎల్ అధికారులు రోడ్డు పనులను ప్రారంభించారు. గతంలో నిర్మించిన రహదారి మలుపును తొలగించి నేరుగా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులు చేపడుతున్నారు.
సీడ్ యాక్సెస్ రోడ్డును ఆగస్టు 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. న్యాయపరమైన వివాదం పరిష్కారం కావడంతో కీలకమైన ప్రాంతంలో రహదారి పనులను పూర్తి చేసేందుకు అధికారులు వేగం పెంచారు.
సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. దొండపాడు నుంచి ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ హాస్పిటల్స్ వద్ద NH-16ను కలుపుతుంది.
ఈ రహదారి అమరావతి నగరంలోని N1 నుంచి N17 వరకు ఉన్న రహదారులను అనుసంధానించడంతో పాటు, రాజధానిని జాతీయ రహదారితో నేరుగా కలుపుతుంది.
మూడు దశల్లో నిర్మాణం
Phase-1, Phase-2లో 9 లేన్ల క్యారేజ్‌వే, మధ్యలో BRTS, ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, గ్రీన్‌బెల్ట్‌లు, వర్షపు నీటి కాలువలు, నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్, మురుగునీరు, ఐసీటీ తదితర సమగ్ర యుటిలిటీ వ్యవస్థలను కూడా ఇందులో భాగంగా నిర్మిస్తున్నారు.
Phase-3లో స్టీల్ బ్రిడ్జిలు, ఎలివేటెడ్ కారిడార్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఇందులో 280 మీటర్ల ప్రధాన స్టీల్ బ్రిడ్జి, 360 మీటర్ల నాలుగు లేన్ల రోడ్డు, బకింగ్‌హామ్ కాలువపై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జి ఉన్నాయి.
భూమి స్థాయిలో 270 మీటర్ల మేర 9 లేన్ల రహదారి కొనసాగిన తర్వాత NH-16 వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌గా మారుతుంది.
భూసేకరణ వివాదం పరిష్కారం కావడంతో ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డులో కీలకమైన అంతరాయం తొలగిపోయింది. సీఎం ప్రారంభోత్సవానికి ముందు పనులను పూర్తి చేసి, రాజధాని అంతర్గత రవాణా వ్యవస్థకు ఈ మార్గాన్ని కీలక అనుసంధానంగా అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టారు.
Don’t receive OTP? Resend