అమరావతి: షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
ఈ సందర్భంగా పిటిషనర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వయంగా కోర్టులో హాజరై తన వాదనలు వినిపించారు.
విచారణ సందర్భంగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఈ కొనుగోళ్లకు సంబంధించిన దస్త్రాలను కోరగా, విద్యుత్ శాఖ అధికారులు ఆ చట్టంలోని సెక్షన్–8ను సాకుగా చూపుతూ సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించారని ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసు విచారణకు అవసరమైన అన్ని రికార్డులను కోర్టు ముందుంచేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు.
ఈ అంశానికి సంబంధించి తాను మూడు అనుబంధ పిటిషన్లు కూడా దాఖలు చేసినట్లు ధర్మాసనానికి తెలిపారు. వాటిని కూడా ప్రధాన పిల్తోపాటు పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు.
వాదనలు విన్న ధర్మాసనం, ప్రధాన ప్రజాహిత వ్యాజ్యంపైనే తుది విచారణ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థల తరఫు న్యాయవాదులు తమ తుది వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని కోర్టును కోరారు.
దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ నాటికి కేసుకు సంబంధించిన అన్ని సంబంధిత దస్త్రాలను కోర్టు ముందు సమర్పించాలని విద్యుత్ శాఖ అధికారులను ధర్మాసనం ఆదేశించింది.
ఈ కేసులో విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు అవసరమా, లేదా అనే అంశంపై తదుపరి విచారణలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Don’t receive OTP? Resend