పోలవరం ప్రాజెక్ట్ భద్రతను మదింపు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శిని, కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ను ఆదేశించాలని కోరుతూ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ వ్యాజ్యం విచారణకు రాగా ఏబీ వెంకటేశ్వరరావు స్వయంగా వాదనలు వినిపిస్తారని, ప్రస్తుతం ఆయన సెమిస్టర్ పరీక్ష రాస్తున్నందున విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని ఓ న్యాయవాది కోరారు. ఇది ఈరోజే విచారణ జరపాల్సినంత అత్యవసరమైన వ్యవహారం కాదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
గ్యాప్-1, గ్యాప్-2 డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాదులు, డిజైన్ విషయంలో ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి క్వాలిటీ కంట్రోల్ తదితర రికార్డులను సీడబ్ల్యూసీ ముందు ఉంచేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యాజ్యంలో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్లానింగ్ అండ్ డిజైన్ చీఫ్ ఇంజినీర్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఛైర్మన్‌తో పాటు మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, బ్యూరో ఇంజినీరింగ్ ఇండియా, ఏఎఫ్ఆర్వై ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్, వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు.
Don’t receive OTP? Resend