న్యూఢిల్లీ: అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరానికి వచ్చిన విరాళాల నిర్వహణపై సోషల్ మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహణలో భారీ ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేశాయి.
అధికారిక సమాచారం ప్రకారం, భక్తుల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన రూ.3,300 కోట్ల విరాళాలన్నీ స్వతంత్ర బాహ్య ఆడిటర్లైన ఎం/ఎస్ వి. శంకర్ అయ్యర్ అండ్ కో. ద్వారా పూర్తిగా ఆడిట్ చేయబడ్డాయి. ఆలయ నిర్మాణానికి రూ.1,800 కోట్లు, భూసేకరణకు రూ.400 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ చెల్లింపులన్నీ పూర్తిగా బ్యాంకుల ద్వారా జరిగాయని, నగదు లావాదేవీలు అసలు జరగలేదని వివరించాయి.
దొంగతనం ఒక ఘటన మాత్రమే
జూన్ 2026లో వెలుగులోకి వచ్చిన ఘటన మొత్తం విరాళాల వ్యవస్థకు సంబంధించిన అవినీతి కాదని, నగదు లెక్కించే ప్రక్రియలో జరిగిన ఒక దొంగతనం ఘటన మాత్రమే అని అధికారులు తెలిపారు. నగదును యంత్రాల ద్వారా లెక్కించే ముందు మాన్యువల్ సార్టింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు.
ఈ కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నియమించిన సైనిక్ సెక్యూరిటీ సర్వీసెస్ (SSS) సంస్థకు చెందిన ఆరుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను సీసీటీవీ ఆధారంగా గుర్తించి వెంటనే అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులకు ఆలయ ట్రస్ట్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు
ఈ వ్యవహారంపై పునర్వ్యవస్థీకరించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగుతోందని, ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీనియర్ ఐపీఎస్ అధికారులు స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నాయి.
భూసేకరణపై ఆరోపణలు ఖండన
భూసేకరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను కూడా అధికారులు ఖండించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోలుకు సంబంధించిన ప్రతి చెల్లింపూ అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా బ్యాంకు-టు-బ్యాంకు బదిలీ ద్వారా జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భూముల మార్కెట్ విలువ పెరగడం, అక్కడి వాణిజ్య భవనాల యజమానులతో పరిహార ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల భూసేకరణ వ్యయం పెరిగిందని వివరించారు.
విరాళాలు తగ్గలేదు
వివాదం తర్వాత కూడా భక్తుల విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నెలకు సగటున రూ.5 కోట్ల హుండీ ఆదాయం కొనసాగిందని, జూన్ ఘటన తర్వాత విరాళాల్లో ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదని పేర్కొన్నాయి.
విరాళాల నిర్వహణలో పారదర్శకత పాటిస్తున్నామని, ట్రస్ట్‌పై వస్తున్న వ్యవస్థాగత అవినీతి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
Don’t receive OTP? Resend