భారత్ తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన మోదీ
జింద్ (హర్యానా): ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో నడిచే ఈ రైలు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ పొగ, కాలుష్యం లేకుండా ప్రయాణిస్తుంది. దీంతో పరిశుభ్రమైన రైలు రవాణా సాంకేతికతను అందిపుచ్చుకున్న దేశాల జాబితాలో భారత్ చేరింది.
ఈ 10 బోగీల రైలు హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల పైలట్ మార్గంలో నడుస్తుంది. ప్రపంచంలోని చాలా హైడ్రోజన్ రైళ్లు 2 నుంచి 4 బోగీలతో మాత్రమే ఉండగా, భారత్ రూపొందించిన ఈ రైలు 10 బోగీలతో సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
రైలులో అమర్చిన ఫ్యూయల్ సెల్స్ హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్‌ను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతాయి, కార్బన్ ఉద్గారాలు ఉండవు.
3,200 హార్స్పవర్ సామర్థ్యం గల ఈ రైలు గంటకు గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు అనుమతి ఇచ్చారు.
సామాన్య ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ రైలులో టికెట్ ధర రూ.5 నుంచి ప్రారంభమవుతోంది.
ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్' కార్యక్రమానికి తొలి అడుగుగా భావిస్తున్నారు. భవిష్యత్తులో దేశంలోని కొండ ప్రాంతాలు, వారసత్వ రైల్వే మార్గాల్లో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారత రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
Login
Comments (0)