జంతర్ మంతర్ లో దూషణలపై ప్రధాని మోడి స్పందన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనలో తనను, తన దివంగత తల్లిని ఉద్దేశించి దూషణలు చేసిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
దూషణలు ఏ సమస్యకూ పరిష్కారం కాదని, తప్పు చేసిన యువతను శిక్షించడం కంటే సరైన మార్గంలో నడిపించడం సమాజ బాధ్యత అని అన్నారు. వారిని తాను వ్యక్తిగతంగా క్షమిస్తున్నానని, సమాజం కూడా అదే దృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మాట్లాడుతూ, జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఘటనను దేశం మొత్తం చూసిందన్నారు. "కొంతమంది దారి తప్పిన యువకులు నాగరిక సమాజంలో ఎవరూ ఉపయోగించకూడని భాషను వాడారు. నన్ను దూషించారు. నా దివంగత తల్లిని కూడా అవమానించారు. అయినా దూషణలు ఏ సమస్యనూ పరిష్కరించవు" అని వ్యాఖ్యానించారు.
"యువతను శిక్షించడం కాదు.. మార్గనిర్దేశం చేయాలి"
తప్పులు చేయడం యువతలో సహజమని, అదే వయస్సులో వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుందని ప్రధాని అన్నారు. సమాజంలో ఆగ్రహం ఉన్న విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని, అయితే ఇప్పుడు వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, వేధించడం కంటే ప్రేమతో అక్కున చేర్చుకుని సరైన దారి చూపాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
"వారు దారి తప్పిన పిల్లలు. వారికి మార్గనిర్దేశం చేయడం మనందరి బాధ్యత. శిక్షించడం వల్ల పరిస్థితులు మారవు. నేను వారిని క్షమిస్తున్నాను. సమాజం కూడా వారిని క్షమించాలని కోరుతున్నాను. మనమంతా కలిసి భారత్ కోసం పనిచేద్దాం" అని మోదీ పిలుపునిచ్చారు.
ఏం జరిగింది?
జూలై 23న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రశ్నాపత్రాల లీకేజీలపై విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న 25 ఏళ్ల యువతి ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన దివంగత తల్లిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.
జీరో ఎఫ్ఐఆర్ నమోదు
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని శాంతిభద్రతలకు భంగం కలిగించడం, ప్రజల్లో విద్వేషం లేదా అపోహలు రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి నిబంధనల కింద కేసు నమోదు చేశారు. అనంతరం కేసును విచారణ కోసం ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
విద్యార్థి సంఘం స్పందన
ఈ కేసుపై నిరసనలకు నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందించారు. నిరసనలో ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉండవచ్చని అంగీకరించిన ఆయన, అలాంటి వ్యాఖ్యలపై క్రిమినల్ చట్టాలను ప్రయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
"ఎవరైనా పరువునష్టం జరిగిందని భావిస్తే సివిల్ లేదా క్రిమినల్ పరువునష్టం కేసు వేయవచ్చు. కానీ నిరసనకారులపై మొత్తం క్రిమినల్ వ్యవస్థను ప్రయోగించడం సమర్థనీయం కాదు. కేవలం అభ్యంతరకరమైన భాష వాడినందుకే వారిని నేరస్తులుగా చూడకూడదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాని చేసిన క్షమాభిక్ష వ్యాఖ్యలు, మరోవైపు నిరసనకారులపై నమోదైన కేసు నేపథ్యంలో ఈ అంశం దేశవ్యాప్తంగా రాజకీయ, న్యాయపరమైన చర్చకు దారితీసింది.
Login
Comments (0)