కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకానికి భారత్‌లో తాము ప్రచురణకర్తలు కాదని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పష్టం చేసింది.
ఈ పుస్తకాన్ని నవంబరు 10న విడుదల చేయనున్నట్లు అమెరికాకు చెందిన పెంగ్విన్ రాండమ్ హౌస్ అనుబంధ విభాగం ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఇండియాలో సోనియా ఆత్మకథ ప్రచురణ విషయంలో పీఆర్ హెచ్ ఐ వెనక్కి తగ్గిందని జాతీయ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.
ప్రచురణకర్తల వివరణ
పుస్తకంలో ఎడిటోరియల్ మార్పులకు రచయిత్రి తిరస్కరించినందునే సోనియా ఆత్మకథను ప్రచురించకూడదని మేము నిర్ణయించుకున్నామని వచ్చిన వార్తలు అవాస్తవమని పీఆర్ హెచ్ ఐ పేర్కొంది. పుస్తక ప్రచురణకు తాము ఆసక్తిగానే ఉన్నామంటూనే రచయితలు ఇచ్చే సమాచార వాస్తవ నిర్ధారణ, పుస్తకానికి ఉపయోగపడే సిఫార్సులు చేయడమన్నది ప్రచురణకర్త బాధ్యత, విధి అని తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు
సోనియా ఆత్మకథ పుస్తకం ప్రచురణ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ ఒత్తిడికి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా లొంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఇది భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హత్య చేయడమేనంటూ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ హయాంలో భారత భూభాగాలను చైనా ఆక్రమించడం, ఆరెస్సెస్ తదితర అంశాలపై మార్పులు చేయడానికి సోనియా గాంధీ అంగీకరించకపోవడంతోనే పుస్తక ప్రచురణకు పీఆర్ హెచ్ ఐ వెనకడుగు వేసిందని ఆరోపించారు.
ఈ-బుక్ లభ్యత
భారత్‌లో బిలాంగింగ్ పుస్తక పంపిణీదారు ఎవరనే విషయమై స్పష్టత రానప్పటికీ ఈ-బుక్ వెర్షన్ రూ.2,615కు ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నట్లు అమెజాన్ ఈ-కామర్స్ వెబ్సైట్ చూపిస్తోంది. ఈ వెబ్సైట్ ప్రకారం సోనియా గాంధీ ఆత్మకథ ఈ-బుక్‌ను బ్రిటన్‌కు చెందిన హార్పర్ కాలిన్స్ అనుబంధ విభాగం విలియం కాలిన్స్ ప్రచురించింది.
Don’t receive OTP? Resend