పారిశ్రామిక విధానం కింద పరిశ్రమల ఏర్పాటు సమయాన ప్రకటించిన ప్రోత్సాహకాలను సకాలంలో చెల్లించకపోతే ఎలాగని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. ఆర్థిక ఇబ్బందులను నెపంగా చూపుతూ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల నిలిపివేత సరికాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపులకు సంబంధించిన అప్పీళ్లపై సోమవారం విచారణ చేపట్టింది.
చెల్లింపులపై అడ్వొకేట్ జనరల్ వివరణ
విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన బకాయిల్లో ఇప్పటికే సగం వరకు చెల్లించామని ధర్మాసనానికి వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల వల్లే చెల్లింపులలో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. వచ్చే సెప్టెంబర్ చివరినాటికి మిగిలిన బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని ఏజీ హామీ ఇచ్చారు. ప్రభుత్వ తరఫున వచ్చిన ఈ హామీని రికార్డుల్లోకి తీసుకున్న ధర్మాసనం, తదుపరి విచారణను అక్టోబర్ నెలకు వాయిదా వేసింది.
కేసు పూర్వాపరాలు
రాష్ట్ర ప్రభుత్వం 2005-10, 2010-15, 2015-20 పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక విధానాల కింద పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలను ప్రకటించింది. విద్యుత్, మూలధన రాయితీల కోసం అనేక సంస్థలు దరఖాస్తు చేసుకోగా అధికారుల నుంచి అనుమతులు లభించాయి. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహక సొమ్మును విడుదల చేయకపోవడంతో 2024లో పలు స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి, బాధితులకు ఇవ్వాల్సిన సొమ్మును 6 శాతం వడ్డీతో కలిపి నాలుగు నెలల వ్యవధిలో చెల్లించాలని 2024 డిసెంబరులో ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయగా, తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం సెప్టెంబర్ లోగా బకాయిలు తీర్చాలని స్పష్టం చేసింది.
Don’t receive OTP? Resend