అమరావతిలో భూమి ధర రికార్డు.. ఎకరం రూ.8.20 కోట్లు
అమరావతి: రాజధాని అమరావతిలో భూముల విలువ కొత్త రికార్డు సృష్టించింది. స్టార్ హోటళ్ల నిర్మాణానికి సీఆర్డీఏ ఎకరానికి రూ.8.20 కోట్ల ధరను నిర్ణయిస్తూ టెండర్లు ఆహ్వానించింది. అమరావతిలో ఇప్పటివరకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. గతంలో గరిష్ఠంగా ఎకరానికి రూ.4 కోట్ల వరకు మాత్రమే ధర నిర్ణయించగా, ఇప్పుడు అది రెట్టింపుకుపైగా పెరిగింది.
రాజధానిలో ఐదు స్టార్ హోటళ్లు, ఐదు ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు కోసం బుధవారం నుంచి టెండర్ పత్రాలు అందుబాటులోకి వచ్చాయి. హోటళ్లకు సంబంధించి జూలై 22న ప్రీ-ప్రపోజల్ సమావేశం నిర్వహించగా, జూలై 30తో టెండర్ల దాఖలు ముగియనుంది.
స్టార్ హోటళ్ల కోసం భూమిని ఫ్రీహోల్డ్ విధానంలో కేటాయించనున్నారు. కనీసం రూ.75 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మూడు త్రీ-స్టార్, రెండు ఫోర్-స్టార్ హోటళ్లను తుళ్లూరు, రాయపూడి, వెంకటపాలెం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయవ్యవస్థ సిబ్బంది, దేశీయ-విదేశీ పెట్టుబడిదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపింది.
అలాగే అమరావతిలో ఐదు ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు కూడా టెండర్లు విడుదల చేసింది. ఎల్కేజీ నుంచి ప్లస్-2 వరకు విద్య అందించే విద్యాసంస్థలను ఆహ్వానిస్తోంది. స్కూళ్ల కోసం మొత్తం 15.80 ఎకరాలను 33 ఏళ్ల దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కేటాయించనుంది. తుళ్లూరు, పెనుమాక, నవులూరు, కృష్ణాయపాలెం, దొండపాడు ప్రాంతాల్లో ఈ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి.
రాజధానికి ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, నిపుణులు, వారి కుటుంబాలు వేగంగా తరలివస్తున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యా, ఆతిథ్య సదుపాయాల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఆర్డీఏ వెల్లడించింది.
Login
Comments (0)