ముంబై: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన టీసీఎస్ (TCS) మత మార్పిడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛత్రపతి సంభాజీనగర్‌కు చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కార్పొరేటర్ మతీన్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గురువారం సాయంత్రం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం నాసిక్‌కు తరలించారు.
అరెస్టు అనంతరం అధికారులు మతీన్ పటేల్ నివాసం, కార్యాలయంపై బుల్డోజర్ చర్యలు కూడా ప్రారంభించారు. ఈ చర్యలు రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీశాయి.
ఏంటి టీసీఎస్ మత మార్పిడి కేసు?
నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో పనిచేసిన ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సహోద్యోగి దానిష్ షేక్ వివాహం చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, కానీ అప్పటికే అతడికి వివాహం జరిగిందని బాధితురాలు ఆరోపించింది.
దానిష్ సోదరి, టీసీఎస్ మాజీ ఉద్యోగి నిదా ఖాన్ బాధితురాలిని మతం మార్చుకునేలా ఒత్తిడి తెచ్చిందని, ఆమె మత విశ్వాసాలను అవమానించిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిదా ఖాన్‌పై ఆరోపణలు
దర్యాప్తులో నిదా ఖాన్ బాధితురాలికి బుర్ఖా, మతపరమైన పుస్తకాలు అందించడంతో పాటు, మొబైల్లో ఇస్లాంకు సంబంధించిన యాప్‌లు ఇన్స్టాల్ చేయించిందని పోలీసులు ఆరోపించారు. ఇంటికి వెళ్లి నమాజ్ ఎలా చేయాలో నేర్పడం, హిజాబ్ ధరించే విధానాన్ని వివరించడం ద్వారా మత మార్పిడికి ప్రయత్నించిందని కేసులో పేర్కొన్నారు.
ఈ కేసులో బలవంతపు మత మార్పిడి, మహిళలపై వేధింపులు, మతపరమైన మనోభావాల దెబ్బతీత, లైంగిక వేధింపులు, మానసిక హింస వంటి మొత్తం తొమ్మిది కేసులను పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మతీన్ పటేల్ పాత్ర
పోలీసుల దర్యాప్తు ప్రకారం, అరెస్టైన నిదా ఖాన్ పరారీలో ఉన్న సమయంలో ఆమెకు మతీన్ పటేల్ ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. కోర్టు సమన్లను పదేపదే పట్టించుకోకపోవడంతో చివరకు అరెస్ట్ చేశారు.
నిదా ఖాన్‌కు బెయిల్
దాదాపు 25 రోజుల పాటు పరారీలో ఉన్న నిదా ఖాన్‌ను మే 7న ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో పోలీసులు అరెస్టు చేశారు. గర్భవతిని అనే కారణంతో ఆమె బెయిల్ కోరగా, ఇటీవల నాసిక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలులో ప్రసవించడం ఏ మహిళకైనా తీవ్ర మానసిక వేదన కలిగిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
టీసీఎస్ స్పందన
ఈ కేసులో పేర్లు వచ్చిన ఉద్యోగులను టీసీఎస్ సస్పెండ్ చేసింది. ఉద్యోగులపై వేధింపులు, బలవంతపు చర్యలు, మతపరమైన ఒత్తిడిపై సంస్థకు జీరో టాలరెన్స్ పాలసీ ఉందని టీసీఎస్ స్పష్టం చేసింది.
Don’t receive OTP? Resend