శరద్ పవార్ పార్టీ NDAలోకి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)ని NDAలోకి తీసుకురావడంతో పాటు, ఎన్సీపీ రెండు వర్గాల విలీనానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడైన జయంత్ పాటిల్ కు NDAలో చేరిక, అలాగే రెండు ఎన్సీపీ వర్గాల విలీనంపై చర్చల బాధ్యత అప్పగించినట్లు సమాచారం. ఇటీవల ఆయన బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
అలాగే ముఖ్యమంత్రి అధికార నివాసం వర్షా బంగ్లాలో ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ తోనూ సమావేశమై, విలీనం జరిగితే కీలక నేతల పాత్రపై చర్చించినట్లు సమాచారం.
శివసేన మంత్రి సంజయ్ శిర్సాట్ మాట్లాడుతూ, శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ రాజకీయ భవిష్యత్తుపై రానున్న ఎనిమిది రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, విలీనం లేదా పొత్తు కుదిరితే జయంత్ పాటిల్, జితేంద్ర అవ్హాద్‌లకు మహారాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్ కు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అంశంపైనా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
అయితే ఈ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయనే ఆసక్తి నెలకొంది.
Login
Comments (0)