నేపాల్‌లో సంభవించిన తీవ్ర ఆకస్మిక వరదల్లో 288 మంది భారత పౌరులు గల్లంతయినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. పర్యటనలు, పనుల నిమిత్తం నేపాల్ వెళ్లి వరదల్లో చిక్కుకున్న 21 మందిని ఇప్పటివరకు సురక్షితంగా కాపాడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జయస్వాల్ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆచూకీ తెలియకుండా పోయిన భారతీయుల్లో త్రిశూలి-1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కార్మికులు ఉన్నారని వెల్లడించారు. వీరితో పాటు తమిళనాడు నుంచి వెళ్లిన రెండు పర్యాటక బృందాల సభ్యులు, పశ్చిమ బెంగాల్ నుంచి 32 మంది, కేరళ నుంచి 33 మంది సహా ఇతర రాష్ట్రాల పౌరులు ఉన్నారని వివరించారు.
మానస సరోవర యాత్రకు వెళ్లిన పలువురు భారత పౌరులు చైనా సరిహద్దు వైపు ఉన్న టిబెట్‌లో చిక్కుకుపోయారని, అక్కడ నుంచి సుమారు 200 మంది సాయం కోసం విజ్ఞప్తి చేశారని జయస్వాల్ తెలిపారు. విపత్తు వేళ బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు దిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, మానవతా దృక్పథంతో సహాయక చర్యలు వేగవంతం చేశామని పేర్కొన్నారు. బాధితుల కోసం 47.5 టన్నుల అత్యవసర సహాయక సామగ్రితో కూడిన రెండు ప్రత్యేక విమానాలను ఇప్పటికే కాఠ్మాండూకు తరలించామని, రవాణా పునరుద్ధరణకు బెయిలీ బ్రిడ్జిని కూడా పంపుతున్నామని స్పష్టం చేశారు.
కాగా, నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో వరదల తీవ్రతకు మరణించిన వారి సంఖ్య 270కి చేరింది. నేపాల్ టూరిజం బోర్డు కథనం ప్రకారం, వివిధ దేశాలకు చెందిన 1,600 మందికి పైగా పౌరులు గల్లంతయ్యారు. ఇందులో అమెరికా, ఉక్రెయిన్, మలేషియా వంటి 30కి పైగా దేశాలకు చెందిన 500 మందికి పైగా విదేశీ పర్యాటకులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Don’t receive OTP? Resend