కుటుంబ పార్టీలకు భిన్నంగా సామర్థ్యమున్న వారికి అవకాశం | తాను సీఎం అభ్యర్థిని కాదన్న విజయసాయి | మేనిఫెస్టోలో ఐదు ప్రధాన అంశాలు | రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదగడమే లక్ష్యం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా విజయదశమి నాటికి ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు పోరాట పటిమ లేదని, అవి కుటుంబ పార్టీలుగా మారిపోయాయని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలపై పోరాడటంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని అన్నారు.
తాను కొత్త పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని, తన కుటుంబ సభ్యులను కూడా సీఎం అభ్యర్థులుగా ముందుకు తీసుకురాబోమని విజయసాయి స్పష్టం చేశారు. రెడ్లు, కమ్మవాళ్లు వంటి కులాలకు మాత్రమే కాకుండా.. సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయాల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు.
‘రెడ్‌బుక్ పార్టీ.. రప్పా రప్పా పార్టీ’
ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలపై విజయసాయి తీవ్ర విమర్శలు చేశారు. ఒక పార్టీని ‘రెడ్‌బుక్ పార్టీ’గా, మరో పార్టీని ‘రప్పా రప్పు పార్టీ’గా అభివర్ణించారు. రాజకీయ పార్టీలు ప్రజల కోసం కాకుండా దోచుకునే హక్కు కోసం పోట్లాడుకుంటున్నాయని ఆరోపించారు.
ప్రతి పనికీ రౌడీ మామూళ్లు చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి థర్డ్ వైబుల్ పొలిటికల్ పార్టీ అవసరమని చెప్పారు.
రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టే సంస్కృతిని టీడీపీనే మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు. అవినీతి జరిగిందని భావిస్తే తనపైనా కేసులు పెట్టాలని, చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు.
‘నా పాత్ర బాల్ థాకరే తరహాలో ఉంటుంది’
కొత్త పార్టీలో తన పాత్రపై కూడా విజయసాయి స్పష్టత ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోనని, బాల్ థాకరే తరహాలో మెంటార్‌గా వ్యవహరిస్తానని చెప్పారు.
సామర్థ్యం ఉన్న నాయకులను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడమే తన ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుతం తన వెంట పెద్దగా నాయకులు కనిపించకపోవడంపై స్పందిస్తూ.. “ఆరు నెలలు, ఏడాది తర్వాత చూడండి. సీనియర్ నాయకులు, యువత వస్తారు” అని వ్యాఖ్యానించారు.
పార్టీ పేరు, జెండా, ఎజెండాను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్ణయం ఒక కాన్క్లేవ్ తర్వాత తీసుకుంటామని చెప్పారు. పార్టీ కార్యకలాపాలను పది రోజులకోసారి నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. విజయదశమి మరుసటి రోజు నుంచే పార్టీ కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉందని, పార్టీ కార్యకలాపాలు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమవుతాయని చెప్పారు.
‘రెండు సంవత్సరాలు ఖాళీగా లేను’
తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని గతంలో చేసిన వ్యాఖ్యలపై విజయసాయి వివరణ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉన్న రెండేళ్ల కాలంలో తాను ఖాళీగా లేనని చెప్పారు.
ఈ సమయంలో 350 పేజీల పుస్తకాన్ని రచించానని వెల్లడించారు. రెడ్డి రాజులు ఏ విధంగా ఆవిర్భవించారనే అంశంపై ఏడాది పాటు పరిశోధన చేసి పుస్తకం రాసినట్లు తెలిపారు. ఈ పరిశోధనను కుల భావనతో కాకుండా చారిత్రక అంశంగా చేపట్టానని చెప్పారు.
ఐదు అంశాలతో మేనిఫెస్టో
కొత్త పార్టీ మేనిఫెస్టోలో ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు విజయసాయి తెలిపారు. అనంతపురం, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల అభివృద్ధితో పాటు రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచాలన్నదానిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు.
రాష్ట్రంపై పెరుగుతున్న అప్పులు, పెరిగిన ధరలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గత 12 ఏళ్లలో రాష్ట్ర అప్పులు రూ.12 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
‘అమరావతిని మార్చడం అవివేకం’
అమరావతి విషయంలోనూ విజయసాయి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చడం అవివేకమని అన్నారు. అమరావతిని వ్యతిరేకించడం వల్ల ప్రయోజనం లేదని, దానిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
25 ఏళ్లు దాటిన వారికి రాజకీయ అవకాశం
యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేయాలని కొత్త పార్టీ భావిస్తోందని విజయసాయి తెలిపారు. 25 ఏళ్లు నిండిన వారందరికీ, ముఖ్యంగా రాష్ట్రంలోని యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. యువతకు కేటాయింపుల్లో 66 శాతం వరకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన ఉందన్నారు.
అందరికీ ఉచిత విద్యుత్.. ఖజానాపై భారం లేకుండా
ఉచిత విద్యుత్ పథకాన్ని రైతులకు మాత్రమే పరిమితం చేయకుండా అవసరమైన విధానంతో అందరికీ ఉచిత విద్యుత్ అందించే అవకాశం గురించి విజయసాయి ప్రస్తావించారు. అయితే అది రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడకుండా అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
పెట్రోల్, పెట్రోలియం ఉత్పత్తులపై ఉన్న పన్నుల భారం తగ్గించే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులపై 31 శాతం జీఎస్టీతో పాటు రూ.4 సర్‌చార్జి ఉందని పేర్కొన్నారు.
సాగు, తాగునీటికి 3,000 టీఎంసీల నిల్వ సామర్థ్యం
రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజయసాయి అన్నారు. సుమారు 3,000 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్న ఆలోచనను వెల్లడించారు.
ప్రభుత్వ విద్య.. ఉద్యోగాలపై దృష్టి
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యావంతులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించే విధానాన్ని తీసుకురావాలని అన్నారు. ప్రస్తుత విద్యా కోర్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవిగా మారాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీ టీచింగ్ సర్వీస్ వంటి విధానాల ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచాలని చెప్పారు. గ్రాడ్యుయేట్లకు నిరుద్యోగ భృతి తరహాలో ‘గ్రాడ్యుయేట్ బ్రిడ్జ్ అలవెన్స్’ ఇవ్వాలన్న ఆలోచనను కూడా ప్రస్తావించారు.
నారాయణ, చైతన్య వంటి ప్రైవేట్ విద్యాసంస్థలకే ర్యాంకులు ఎందుకు వస్తున్నాయనే అంశాన్ని పరిశీలించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని అన్నారు.
‘మూడేళ్లలో నా ఇమేజ్ ఎలా మారుతుందో చూడండి’
కొత్త పార్టీకి ప్రజల్లో ఆదరణ ఎలా వస్తుందన్న ప్రశ్నపై విజయసాయి ఆసక్తికరంగా స్పందించారు. ప్రస్తుతం తన వెంట పెద్దగా నాయకులు లేకపోయినా ఆరు నెలలు లేదా ఏడాది తర్వాత పరిస్థితి మారుతుందని అన్నారు.
కొత్త పార్టీ నిర్మాణానికి తాను ఎంతవరకు డబ్బు ఖర్చు చేస్తున్నాననే అంశంపై కూడా ఆయన మాట్లాడారు. వచ్చే మూడేళ్లలో తన రాజకీయ ఇమేజ్ ఎలా అభివృద్ధి చెందుతుందో చూడాలని అన్నారు.
ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
‘పాదయాత్ర చేస్తా.. కానీ రోడ్ల మీద నడవను’
ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్ర చేస్తానని విజయసాయి తెలిపారు. అయితే సాధారణంగా చేసే రోడ్డు పాదయాత్రకు భిన్నంగా తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు.
బీజేపీతో తనకు ప్రస్తుతం సత్సంబంధాలే ఉన్నాయని కూడా విజయసాయి స్పష్టం చేశారు.
కొత్త పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలన్న విజయసాయి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Don’t receive OTP? Resend