యాపిల్ (Apple) సంస్థ సుదీర్ఘకాల సీఈఓ టిమ్ కుక్ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ ఎంపికయ్యారు. కాగా, కుక్ ఇకపై యాపిల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.
సుమారు మూడు దశాబ్దాల పాటు సంస్థలో వివిధ హోదాల్లో పనిచేసిన టిమ్ కుక్, దాదాపు 15 ఏళ్ల పాటు సీఈఓగా బాధ్యతలు निर्వర్తించి యాపిల్‌ను ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా తీర్చిదిద్దారు.
యాపిల్‌లో చేరిక వెనుక ఆసక్తికర కథ
టిమ్ కుక్ యాపిల్‌లో చేరడం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1998లో ఆయన కాంపాక్ కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు. అప్పట్లో కాంపాక్ మార్కెట్ విలువ 30 బిలియన్ డాలర్లు ఉండగా, యాపిల్ కేవలం 3 బిలియన్ డాలర్లతో దివాలా అంచున కొట్టుమిట్టాడుతోంది. ఆ సమయంలో యాపిల్ నుంచి వచ్చిన ఉద్యోగ ప్రతిపాదనను టిమ్ కుక్ తిరస్కరించారు. అయితే, యాపిల్ ప్రతినిధుల నిరంతర అభ్యర్థనల మేరకు సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌తో భేటీకి అంగీకరించారు. ఆ సమావేశంలో స్టీవ్ జాబ్స్ విజన్, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు కుక్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సన్నిహితులు వద్దు అని వారించినా వినకుండా, కాంపాక్ ఉద్యోగాన్ని వదిలి యాపిల్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు.
మూడు దశాబ్దాల ప్రస్థానంలో అద్భుత విజయాలు
యాపిల్‌లో చేరిన తర్వాత కుక్ వివిధ హోదాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. 2011లో స్టీవ్ జాబ్స్ అనారోగ్యం కారణంగా తప్పుకున్న తర్వాత టిమ్ కుక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో యాపిల్ ఊహించని మైలురాళ్లను అధిగమించింది. కుక్ బాధ్యతలు చేపట్టే నాటికి 350 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువ, ఆయన హయాంలో రికార్డు స్థాయిలో 4.5 ట్రిలియన్ డాలర్లను దాటింది.
ఈ కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 2,275 శాతం వృద్ధి సాధించాయి. కేవలం హార్డ్‌వేర్ ఉత్పత్తులకే పరిమితం కాకుండా యాప్ స్టోర్, ఐక్లౌడ్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పే, యాపిల్ టీవీ+ వంటి సేవల విభాగాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే 2015లో యాపిల్ వాచ్, 2016లో ఎయిర్‌పాడ్స్‌ను మార్కెట్లోకి తెచ్చి సంచలనం సృష్టించారు. ఇంటెల్ ప్రాసెసర్లపై ఆధారపడటాన్ని తగ్గించి, సొంతంగా M-సిరీస్ చిప్‌లను తయారు చేయడంలో కుక్ కీలక పాత్ర పోషించారు.
కొన్ని సవాళ్లు మరియు వైఫల్యాలు
టిమ్ కుక్ విజయవంతమైన ప్రస్థానంలో కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. భారీ పెట్టుబడులతో ప్రారంభించిన ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్టును 2024లో కంపెనీ రద్దు చేయాల్సి వచ్చింది. అలాగే మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల ట్రెండ్ నడుస్తున్నా, యాపిల్ నుంచి ఇప్పటివరకు అలాంటి మోడల్ ఏదీ రాకపోవడం ఒక వెలితిగా మిగిలిపోయింది. కొత్త సీఈఓ జాన్ టెర్నస్ ఆధ్వర్యంలో యాపిల్ త్వరలోనే ఫోల్డబుల్ ఫోన్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Don’t receive OTP? Resend