ఇప్పటివరకు UPI చెల్లింపులు పూర్తిగా ఉచితం. అయితే అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000కు మించిన కొన్ని Person-to-Merchant (P2M) లావాదేవీలపై Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది. ఈ ఛార్జీని కస్టమర్ కాకుండా వ్యాపారి చెల్లించాలి.
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖరారు చేసింది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఎన్పీసీఐ తెలిపింది. రూ.2వేలలోపు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలూ వర్తించబోవని, ఆపైబడిన నిర్దిష్ట లావాదేవీలకు మాత్రం 0.4 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గరిష్ఠ పరిమితిని రూ.300గా నిర్ణయించింది.
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధింపునకు సంబంధించి వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఎన్పీసీఐ ప్రత్యేకంగా ఎఫ్ఏక్యూలను (faqs) విడుదల చేసింది.
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పీ2ఎం యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుందని వెల్లడించింది. అలాగే రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఎండీఆర్ గరిష్ఠంగా రూ.300కు పరిమితం చేసింది. రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనం వంటి నిర్దిష్ట విభాగాల్లో రూ.2,000 దాటిన చెల్లింపులకు ఒక్కో లావాదేవీకి ఫ్లాట్‌గా రూ.5 ఎండీఆర్ వర్తిస్తుందని పేర్కొంది.
స్థానిక దుకాణాలు లేదా వీధి వ్యాపారుల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసే చెల్లింపులు వినియోగదారులకు పూర్తిగా ఉచితమని ఎన్పీసీఐ స్పష్టం చేసింది.
స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బులు పంపే వ్యక్తుల మధ్య జరిగే బదిలీలు లేదా స్వీయ ఖాతాల మధ్య బదిలీలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది.
పెద్ద వ్యాపారులు ఈ ఎండీఆర్ ఛార్జీలను కొనుగోలుదారులపై మోపడానికి వీలేదని, వ్యాపారులు ఈ ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయకూడదని తేల్చిచెప్పింది. కస్టమర్లు తాము కొనుగోలు చేసిన వస్తువులు లేదా సేవల అసలు ధర మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.
యూపీఐ నిర్వహణ, సర్వర్లు, సైబర్ సెక్యూరిటీ, బ్యాంక్ సాంకేతిక మద్దతు కోసం ఏడాదికి దాదాపు రూ.20వేల కోట్లు ఖర్చవుతున్నట్లు ఎన్పీసీఐ వివరించింది.
శాశ్వత సాంకేతిక ఆవిష్కరణలకు వాణిజ్యపరమైన ఆదాయ నమూనా అవసరమని పేర్కొంది. జీరో ఎండీఆర్ విధానంలో కేవలం పెద్ద టెక్ కంపెనీలు మాత్రమే నష్టాలను భరించగలవని, స్థిరమైన వాణిజ్య నమూనా రావడం వల్ల చిన్న ఫిన్‌టెక్ స్టార్టప్‌లు కూడా మార్కెట్లోకి రావడానికి వీలవుతుందని తెలిపింది. మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లకు చేసే చెల్లింపులపై నామమాత్రపు 0.02 శాతం ఎండీఆర్ వర్తిస్తుందని, దీని గరిష్ఠ పరిమితి రూ.300 అని ఎన్పీసీఐ వెల్లడించింది.
Don’t receive OTP? Resend