రూ.5,750 కోట్ల టాటా రెన్యూవబుల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూరులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ఆధ్వర్యంలో రూ.5,350 కోట్ల వ్యయంతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
ఏడాదిలోనే 400 శాతం వృద్ధి
గత ఏడాదితో పోలిస్తే ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగిందని లోకేష్ పేర్కొన్నారు. 2024లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఈ రంగం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలో ఉందని, గత ఐదేళ్లలో ఒక్క పెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదని విమర్శించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం కోల్పోయారని, ఇప్పుడు అదే విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడంలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు.
క్లీన్ ఎనర్జీలో భారీ లక్ష్యాలు
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 ద్వారా 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. సోలార్ మాడ్యూల్స్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ట్రాన్స్మిషన్ మౌలిక వసతులు, పోర్టులు, నిల్వ వ్యవస్థలు వంటి మొత్తం క్లీన్ ఎనర్జీ సరఫరా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
800 మెగావాట్ల టాటా పవర్ ప్రాజెక్టు
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ చేపడుతున్న ఈ ప్రాజెక్టులో పత్తికొండలో 400 మెగావాట్ల సౌర విద్యుత్, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. మొత్తం 800 మెగావాట్ల హైబ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ దశలో సుమారు 4,000 మందికి ఉపాధి లభించనుండగా, 3,400 ఎకరాలకుపైగా భూమిని లీజుకు ఇచ్చిన 1,100కు పైగా రైతు కుటుంబాలకు దాదాపు 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం లభిస్తుందని లోకేష్ తెలిపారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఆహ్వానం
ఐఐటీ తిరుపతి, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భాగస్వామ్యం కావాలని టాటా పవర్‌ను లోకేష్ ఆహ్వానించారు. భవిష్యత్తు ఇంజినీర్లు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టాటా పవర్ సీఈఓ, ఎండీ ప్రవీర్ సిన్హా, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సీఈఓ, ఎండీ సంజయ్ బంగా, సుజ్లాన్ వైస్ చైర్మన్ గిరీష్ తంతి, భారీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, టాటా పవర్, సుజ్లాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Login
Comments (0)