రాజమహేంద్రవరం: చిన్నారికి క్రీడా నైపుణ్యాలు నేర్పిస్తాడని నమ్మిన వ్యక్తి వేధింపులు తమ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేశాయని ఆరోపిస్తూ కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ శాఖ ఏఈ తిల్లపూడి నూకరాజు కుటుంబంతో కలిసి గోదావరిలో దూకిన ఘటన కలకలం రేపింది.
నలుగురిలో పదేళ్ల బాలుడు ఈత కొడుతూ మత్స్యకారుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. నూకరాజు మృతదేహం లభించగా.. ఆయన భార్య, కుమార్తె కోసం గాలింపు కొనసాగుతోంది.
కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన నూకరాజు (61) పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. గత పదేళ్లుగా అదే విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన వచ్చే జనవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆదివారం అర్ధరాత్రి ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (38), మనవడు రియాన్ష్ కార్తికేయరెడ్డి (10)తో కలిసి కారులో రాజమహేంద్రవరం చేరుకున్నారు.
రోడ్ కమ్ రైలు వంతెనపై కారు నిలిపిన అనంతరం నలుగురూ గోదావరిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సమీపంలోని లంక ప్రాంతాల నుంచి మత్స్యకారులను రప్పించి గాలింపు చేపట్టారు.
ఈత కొట్టి బయటపడ్డ బాలుడు
నీటిలో పడిన కార్తికేయ దాదాపు 20 నిమిషాల పాటు ఈదుతూ ‘హెల్ప్’ అంటూ కేకలు వేశాడు. అతడి అరుపులు విన్న మత్స్యకారులు పడవతో అక్కడికి చేరుకుని బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. కాలు, నడుముపై స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందించి బంధువులకు అప్పగించారు.
అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు ప్రత్యేక బోట్లతో గాలింపు చేపట్టారు. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో దోబీఘాట్ వద్ద నూకరాజు మృతదేహం లభించింది. మీనా, సౌజన్య కోసం గాలింపు కొనసాగుతోంది.
సాధిక్‌ఖాన్ వేధింపులే కారణమని లేఖ
కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కాకినాడకు చెందిన ప్రొఫెషనల్ రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాధిక్‌ఖాన్ వేధింపులే కారణమని నూకరాజు రాసిన లేఖలో ఆరోపించారు.
ఆ లేఖను ఆదివారం రాత్రి 11.27 గంటలకు నూకరాజు తన సహోద్యోగులు, మరికొందరికి వాట్సాప్‌లో పంపినట్లు పోలీసులు తెలిపారు. తన అల్లుడు జులై 2న మరణించిన తర్వాత.. తన కుమార్తెకు సహాయం చేస్తానని సాధిక్ ప్రతిపాదించాడని, అయితే కుటుంబం అందుకు అంగీకరించలేదని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
తన కుమార్తెను, ఐదో తరగతి చదువుతున్న మనవడిని చంపుతానంటూ బెదిరించడంతో పాటు విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడని నూకరాజు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తెను తీవ్రంగా వేధిస్తున్నాడని, తాము ప్రశ్నిస్తే చంపుతానని బెదిరిస్తున్నాడని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై కలెక్టర్, ఎస్పీ చర్యలు తీసుకోవాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని నూకరాజు కోరినట్లు పోలీసులు తెలిపారు.
గతంలోనూ ఆరోపణలు
సాధిక్‌ఖాన్ కాకినాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో షూటింగ్ కోచ్‌గా పనిచేసినట్లు సమాచారం. అక్కడ ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అనంతరం సొంతంగా షూటింగ్ అకాడమీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కొంతకాలం క్రితం సౌజన్యకు సాధిక్ పరిచయమయ్యాడని, ఆ తర్వాత ఆమెను వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ శివగణేశ్ తెలిపారు. పరారీలో ఉన్న సాధిక్‌ఖాన్‌ను పట్టుకునేందుకు 10 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
‘అమ్మను ఆపేందుకు ప్రయత్నించా’
నీటి నుంచి బయటపడిన కార్తికేయ చెప్పిన వివరాలు ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. సాధిక్ తమ ఇంటికి తరచూ వచ్చేవాడని, తన తల్లిని కొడుతూ గొడవ చేసేవాడని బాలుడు చెప్పినట్లు సమాచారం. బంగారం, డబ్బు, లాకర్ తాళాలు కూడా తీసుకున్నాడని అతడు పేర్కొన్నాడు.
వంతెన వద్దకు వచ్చిన తర్వాత అందరూ దూకాలని తాత చెప్పారని, తన తల్లి చేయి పట్టుకుని దూకిందని కార్తికేయ తెలిపాడు. ఆమెను వెనక్కి లాగేందుకు ప్రయత్నించగా తాను కూడా నీటిలో పడిపోయానని చెప్పాడు. చిన్నప్పుడు ఈత నేర్చుకున్నందున చీకట్లో ఈదుతూ సాయం కోసం కేకలు వేసినట్లు వివరించాడు.
కుటుంబంలో వరుస విషాదాలు
నూకరాజు, మీనా దంపతుల కుమారుడు కూడా కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. తాజాగా కుమార్తె, మనవడితో కలిసి ఈ విషాద ఘటన జరగడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
బాధ్యులపై కఠిన చర్యలు: పవన్‌కల్యాణ్
ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఎవరైనా బాధ్యులుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం నూకరాజు మృతదేహానికి సంబంధించిన తదుపరి చర్యలతో పాటు, గల్లంతైన మీనా, సౌజన్య కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు కుటుంబం చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సాధిక్‌ఖాన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Don’t receive OTP? Resend