అమరావతి: గోదావరి జలాలు ఉత్తరాంధ్ర వైపు ప్రవహించడం ప్రారంభించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ రెగ్యులేటర్ను ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.
సుమారు 213 కిలోమీటర్ల కాలువ ద్వారా నీరు ఉత్తరాంధ్రకు చేరనుంది. తొలి దశలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది.
అయితే పోలవరం ప్రధాన డ్యామ్ ఇంకా పూర్తికాలేదు. రిజర్వాయర్ కూడా పూర్తిస్థాయి నిల్వకు రాలేదు. మరి నీరు కాలువలోకి ఎలా వచ్చింది?
దీనికి సమాధానం పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. పురుషోత్తపట్నం వద్ద గోదావరి నుంచి భారీ పంపుల ద్వారా నీటిని పైకి ఎత్తి పోలవరం ఎడమ ప్రధాన కాలువలోకి పంపే వ్యవస్థను ముందుగానే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నీరు కాలువ సహజ వాలు ఆధారంగా గ్రావిటీతో ముందుకు సాగుతుంది.
గ్రావిటీ అంటే నీటిని ప్రతి దశలో పంపులతో తోడకుండా, ఎత్తైన స్థానం నుంచి తక్కువ ఎత్తు వైపు ప్రవహించేలా కాలువను నిర్దిష్ట స్లోప్తో నిర్మించడం. అందువల్ల కాలువలోకి నీరు చేరిన తర్వాత వందల కిలోమీటర్లు పంపుల అవసరం లేకుండా ప్రయాణించగలదు.
పోలవరం ప్రాజెక్టులో ఎడమ కాలువ ఉత్తరాంధ్ర వైపు, కుడి కాలువ దక్షిణం, కృష్ణా బేసిన్ వైపు నీటిని తరలిస్తుంది. ఎడమ కాలువ మార్గంలో కొండలు, నదులు, వాగులను దాటేందుకు సొరంగాలు, అక్విడక్ట్లు, సైఫన్లు నిర్మించారు. పాంపా నదిపై అక్విడక్ట్కు 312 పైల్స్, తాండవ నదిపై 447 మీటర్ల పొడవైన అక్విడక్ట్, యేలేరు వద్ద నది అడుగునుంచి నీటిని తీసుకెళ్లే సైఫన్ ఉన్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న నీటి విడుదల పోలవరం డ్యామ్ పూర్తయిందని అర్థం కాదు. అలాగే పోలవరానికి సంబంధం లేని నీటిని కాలువలో వదులుతున్నారనడం కూడా సరైనది కాదు. ఇది పోలవరం ఎడమ కాలువను ముందుగానే ఉపయోగించుకునే లిఫ్ట్ + గ్రావిటీ విధానం. భవిష్యత్తులో పోలవరం రిజర్వాయర్ పూర్తయి తగిన నీటి మట్టం ఏర్పడినప్పుడు, రిజర్వాయర్ హెడ్ ఆధారంగా కాలువలకు నీటిని అందించి గ్రావిటీ ద్వారా మరింత విస్తృతంగా తరలించవచ్చు.
Don’t receive OTP? Resend