ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే ఇంటర్నెట్ సదుపాయం లేని ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా యూపీఐ 123పే సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త సదుపాయం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 20 కోట్ల మందికి పైగా ఫీచర్ ఫోన్ యూజర్లు ఎలాంటి ఇంటర్నెట్ లేకుండానే సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలు కలుగుతుంది.
రెండు జీ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో సైతం నమ్మకమైన లావాదేవీలు నిర్వహించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఎస్ఎంఎస్ ఆధారిత టెక్నాలజీని ఉపయోగించుకునే ఈ సర్వీస్ విస్తరణ కోసం ఫోన్‌పే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలైన నోకియా, హెచ్ఎండీ, లావా ఇంటర్నేషనల్, ఐటెల్ మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల ఫోన్ కొనుగోలు చేసేటప్పుడే ఈ ఫీచర్ ప్రీ బండిల్డ్‌గా లభిస్తుంది.
స్మార్ట్ఫోన్లకే పరిమితమైన డిజిటల్ చెల్లింపులను దేశంలోని ప్రతి మూలకు విస్తరించే ఉద్దేశంతోనే దీనిని తీసుకొచ్చినట్లు ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. దీనిద్వారా యూజర్లు నేరుగా వ్యక్తులకు, వ్యాపారులకు చెల్లింపులు చేసుకోవచ్చు. కెమెరా కలిగిన ఫీచర్ ఫోన్ల వినియోగదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మరీ చెల్లించే అవకాశం ఉంది.
కేవలం చెల్లింపులే కాకుండా ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేయడం, లావాదేవీల హిస్టరీని పరిశీలించడం వంటి సేవలను కూడా పొందవచ్చు. తొలిసారి ఈ సర్వీస్ వాడే వారి కోసం ఇంగ్లిష్తో పాటు పన్నెండు భారతీయ భాషల్లో సహాయం అందించే ప్రత్యేక ఏఐ హెల్ప్‌లైన్‌ను కూడా ఫోన్‌పే అందుబాటులోకి తీసుకువచ్చింది.
Don’t receive OTP? Resend