ఇకపై డబుల్ రిజస్ట్రేషన్లకు చెల్లు: సిఎం చంద్రబాబు
"భూ సమస్యలకు శాశ్వత ఫుల్స్టాప్ పెట్టేలా రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా సంస్కరిస్తున్నాం. భూ వివాదాలు తగ్గితే ప్రజల ఫిర్యాదులు కూడా గణనీయంగా తగ్గుతాయి" అని చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భూములపై డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ పత్రాలు, రికార్డుల తారుమారుకు శాశ్వత అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 'మీ భూమి–బ్లాక్‌చెయిన్' పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించి, ఆంధ్రప్రదేశ్‌ను "ల్యాండ్ లిటిగేషన్ ఫ్రీ స్టేట్"గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు.
"భూ సమస్యలకు ప్రధాన కారణం డబుల్ రిజిస్ట్రేషన్లు, రికార్డుల తారుమారే. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో ఇకపై అలాంటి సమస్యలకు అవకాశం ఉండదు. భూమి కొనుగోలు, అమ్మకాలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే వ్యవస్థను తీసుకొస్తున్నాం" అని చంద్రబాబు తెలిపారు.
'సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్'గా భూ రికార్డులు
ప్రాజెక్టు వివరాలను సీఎంకు వివరించిన రెవెన్యూ శాఖ అధికారులు, భూమికి సంబంధించిన అన్ని రికార్డులు ఒకే వేదికపై ఉండేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు.
ప్రస్తుతం వేర్వేరుగా పనిచేస్తున్న రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువస్తున్నారు. దీంతో భూమికి సంబంధించిన యాజమాన్యం, సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర వివరాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి.
ప్రతి భూమికి ప్రత్యేక డిజిటల్ ఐడీ కేటాయించి, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా ట్యాంపర్-ప్రూఫ్ భద్రత కల్పిస్తారు. దీంతో ఒకే భూమిని రెండుసార్లు రిజిస్టర్ చేయడం లేదా రికార్డుల్లో రహస్యంగా మార్పులు చేయడం దాదాపు అసాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.
ఏడు మండలాల్లో పైలట్
ప్రస్తుతం ఈ ప్రాజెక్టును రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఒక్కో మండలంలో అమలు చేస్తున్నారు.
పైలట్‌కు ఎంపికైన మండలాలు:
ఆస్పరి – కర్నూలు జిల్లా
పెనుమూరు – చిత్తూరు జిల్లా
రేపల్లె – బాపట్ల జిల్లా
గన్నవరం – కృష్ణా జిల్లా
కడియం – తూర్పుగోదావరి జిల్లా
గుమ్మలక్ష్మీపురం – పార్వతీపురం మన్యం జిల్లా
కొత్తవలస – విజయనగరం జిల్లా
ఈ మండలాల పరిధిలోని 89 రీ-సర్వే గ్రామాల్లో 1,37,763 భూ పార్సిళ్ల (Land Parcels) డిజిటల్ మ్యాప్‌లను బ్లాక్‌చెయిన్‌లో నమోదు చేయనున్నారు.
హైపర్‌లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీతో అభివృద్ధి
ఈ వ్యవస్థను NIC ఆంధ్రప్రదేశ్, NIC బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగిస్తున్న Hyperledger Fabric బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ వ్యవస్థను రూపొందించారు.
QR కోడ్, ఆధార్ అనుసంధానం
ప్రతి భూమికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉండేలా, అవసరమైన చోట ఆధార్ అనుసంధానం కూడా చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. దీంతో భూమి వివరాలను వేగంగా ధృవీకరించడం, యాజమాన్య సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.
గత ప్రభుత్వ విధానాలపై సీఎం విమర్శలు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భూ రికార్డులలో లోపాలు, అక్రమ మార్పుల కారణంగా విలువైన భూముల విషయంలో అనేక మోసాలు జరుగుతున్నాయని అన్నారు.
"తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో భూ వివాదాలు తక్కువే. అయితే గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో కూడా భూ తగాదాలు పెరిగాయి. ముఖ్యంగా 22ఏ నిబంధనను కక్షసాధింపులకు ఉపయోగించారు" అని విమర్శించారు.
ప్రభుత్వం ప్రస్తుతం 'ప్రక్షాళన–విముక్తి–భద్రత' అనే మూడు అంశాలపై దృష్టి పెట్టి భూ సమస్యలను పరిష్కరిస్తోందని తెలిపారు.
వివాదాస్పద భూములకు విముక్తి
రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వేలు, రికార్డుల ప్రక్షాళన చేపడుతున్నామని, కొత్తగా రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్‌బుక్‌లు అందిస్తున్నామని సీఎం చెప్పారు.
శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు పరిష్కారం చూపినట్లు వెల్లడించారు.
రెండు నెలల పాటు అధ్యయనం
పైలట్ ప్రాజెక్టును రెండు నెలల పాటు సమగ్రంగా పరిశీలించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమలులో ఎదురయ్యే సమస్యలను నమోదు చేసేందుకు ప్రత్యేక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు, ఫిర్యాదుల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పారు.
నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా
రీ-సర్వే పూర్తైన గ్రామాలను దశలవారీగా బ్లాక్‌చెయిన్ వ్యవస్థలోకి తీసుకువస్తామని, ఈ ఏడాది నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'మీ భూమి–బ్లాక్‌చెయిన్' వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని సీఎం వెల్లడించారు.
"భూ సమస్యలకు శాశ్వత ఫుల్స్టాప్ పెట్టేలా రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా సంస్కరిస్తున్నాం. భూ వివాదాలు తగ్గితే ప్రజల ఫిర్యాదులు కూడా గణనీయంగా తగ్గుతాయి" అని చంద్రబాబు పేర్కొన్నారు.
కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సాయి ప్రసాద్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు, ఏడు జిల్లాల కలెక్టర్లు, NIC ప్రతినిధులు పాల్గొన్నారు.
Login
Comments (0)