న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో కాలిన కరెన్సీ నోట్లు లభించిన వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిటీ నివేదిక పార్లమెంటు ముందుకు వచ్చింది. నివేదికలో నగదు అక్కడ ఎందుకు ఉంది, ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందనే కీలక ప్రశ్నలకు జస్టిస్ వర్మ సరైన వివరణ ఇవ్వలేకపోయారని కమిటీ పేర్కొంది.
కరెన్సీ నోట్లను గుర్తించిన ప్రాంతంలో చట్టపరమైన తనిఖీలు, సీలింగ్‌కు ముందు భౌతిక సాక్ష్యాలను భద్రపరచడంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది. స్టోర్‌రూమ్‌లోని సాక్ష్యాధారాల స్థితి కూడా చెదిరిపోయిందని నివేదికలో పేర్కొంది.
జస్టిస్ వర్మ ఇచ్చిన వివరణలో నిష్పాక్షికత, పారదర్శకత, బాధ్యత కనిపించలేదని కమిటీ వ్యాఖ్యానించింది. ఆయన వివరణ దాటవేత ధోరణిలో, అసంతృప్తికరంగా ఉందని పేర్కొంది. దీంతో నగదుకు సంబంధించిన వివరణ లేకపోవడం, సాక్ష్యాధారాలు చెదిరిపోవడం, ఆయన సమాధానాల్లో స్పష్టత లేకపోవడం వంటి అంశాలపై కమిటీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
అసలు వివాదం ఏంటి?
2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడి స్టోర్‌రూమ్‌లో భారీగా కాలిపోయిన కరెన్సీ నోట్లను గుర్తించారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో రూ.500 నోట్ల కట్టలు కాలిపోయిన స్థితిలో కనిపించాయని పలువురు అగ్నిమాపక, పోలీసు అధికారులు విచారణలో వెల్లడించారు.
ఈ వ్యవహారంపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో అంతర్గత విచారణ జరిగింది. ఆ కమిటీ 55 మంది సాక్షులను విచారించి, వీడియోలు, ఫొటోలు, అగ్నిమాపక శాఖ రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించింది. నగదు ఉన్న స్టోర్‌రూమ్‌పై జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యక్ష లేదా పరోక్ష నియంత్రణ ఉందని ఆ కమిటీ నిర్ధారించింది.
అంతర్గత విచారణలో జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారం ఉందని, ఆయన ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని తేలడంతో తదుపరి చర్యలకు మార్గం ఏర్పడింది. అనంతరం ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది.
పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు
2025 జూలైలో పలువురు ఎంపీలు జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని కోరుతూ నోటీసు ఇచ్చారు. ఈ ప్రతిపాదనను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించి, 2025 ఆగస్టు 12న జస్టిస్ వర్మపై ఆరోపణలను విచారించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
తొలుత సుప్రీంకోర్టు జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. ఇందులో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, సీనియర్ న్యాయవాది బి.వి. ఆచార్య సభ్యులుగా ఉన్నారు. అనంతరం కమిటీ పునర్వ్యవస్థీకరణలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ సభ్యుడిగా చేరారు.
కమిటీ తన నివేదికను 2026 మే 18న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఇది Judges (Inquiry) Act, 1968 ప్రకారం రూపొందించిన నివేదిక.
రాజీనామా చేసినా.. విచారణ కొనసాగింపు
ఇదిలా ఉండగా, జస్టిస్ యశ్వంత్ వర్మ 2026 ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. అయితే ఆయనపై పార్లమెంటరీ ప్రక్రియ కొనసాగుతుండటంతో కమిటీ విచారణను పూర్తి చేసి నివేదిక సమర్పించింది. అంతకుముందు ఆయన ఈ విచారణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలకు ప్రత్యక్ష ఆధారాలు లేవని, విచారణ ఊహాగానాల ఆధారంగా సాగుతోందని వాదించారు.
నివేదికలోని నిర్ధారణల ఆధారంగా తదుపరి రాజ్యాంగపరమైన చర్యలపై పార్లమెంటు నిర్ణయం తీసుకోనుంది.
Don’t receive OTP? Resend