దిల్లీ: దిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice) నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్రపతి అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
ప్రస్తుతం జస్టిస్ కామేశ్వరరావు దిల్లీ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు. గతంలో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వి.ఎం. పంచోలి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి కొలీజియం ఆయన పేరును సిఫార్సు చేసింది.
తూర్పుగోదావరి నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానాల వరకు
జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పొన్నమండ గ్రామం. 1965 ఆగస్టు 7న అమలాపురంలోని అమెరికన్ ఆసుపత్రిలో జన్మించారు. ఆయన తండ్రి వాసుదేవ మూర్తి ఉద్యోగరీత్యా దిల్లీలో స్థిరపడటంతో విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది.
1990లో దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన, 1991లో దిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. అనంతరం సుప్రీం కోర్టు, దిల్లీ హైకోర్టు, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్లలో న్యాయవాదిగా విశేష అనుభవం సంపాదించారు.
న్యాయమూర్తిగా ప్రస్థానం
2010లో దిల్లీ హైకోర్టు ఆయనకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించింది. 2013 ఏప్రిల్ 17న దిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన, 2015 మార్చి 18న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
2024 జూన్ 1న కర్ణాటక హైకోర్టుకు బదిలీ కాగా, 2025 మే 30 నుంచి అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2025 జూలై 21న తిరిగి దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్నారు.
బలపడిన తెలుగువారి ప్రాతినిధ్యం
జస్టిస్ కామేశ్వరరావు నియామకంతో దేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల జాబితాలో మరో తెలుగు న్యాయమూర్తి చేరనున్నారు. ఇప్పటికే త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు సేవలందిస్తున్నారు. తాజా సిఫార్సుతో దేశ న్యాయవ్యవస్థలో తెలుగువారి ప్రాతినిధ్యం మరింత బలపడనుంది.
Don’t receive OTP? Resend