హరియాణా సింగర్ అంకిత్ బాల్యన్ హత్య వెనక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అతడు నటించి పాడిన ఓ పాట యూట్యూబ్‌లో ఏకంగా 54 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడమే అతడి ప్రాణాలు తీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ జిమ్ బయట ఆగస్టు 26న సాయంత్రం 28 ఏళ్ల అంకిత్ బాలియన్ ను దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అతడు 'భరీ కోర్ట్ మే గోలీ మారేంగే..' అనే పాటలో నటించాడు. ఈ పాటలోని సాహిత్యం తమ గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగిని అవమానించేలా ఉందని 'గోగి గ్యాంగ్' సభ్యులు భావించారు.
2021లో ఢిల్లీ రోహిణి కోర్టులో ప్రత్యర్థి 'టిల్లు తాజ్‌పురియా' గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన తమ లీడర్ చావును ఈ పాట అవహేళన చేసేలా ఉందంటూ కక్ష పెంచుకున్నారు.
ప్రత్యర్థి గ్యాంగ్‌కు మద్దతుగా ఈ పాట తీశాడనే అనుమానంతో గతంలోనే అంకిత్‌కు బెదిరింపులు వచ్చాయి. తాను కేవలం నటుడిని మాత్రమేనని, లిరిక్స్ తో సంబంధం లేదని స్పష్టం చేసినా నిందితులు వదలలేదు. షామ్లీకి వచ్చి రెక్కీ నిర్వహించి మరీ ఈ హత్యకు ఒడిగట్టారు.
ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన యూపీ పోలీసులు ఆగస్టు 31న తనిఖీలు నిర్వహించారు. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న నిందితులను చుట్టుముట్టగా, వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సుమిత్, మోహిత్ అనే ఇద్దరు నిందితులు మృతి చెందగా, మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
Don’t receive OTP? Resend