బ్రాహ్మణి భూములు మళ్లీ ప్రభుత్వ వశం
18 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు.. రూ.350 కోట్ల యాక్సిస్ బ్యాంకు రుణం, కోర్టు వివాదాల తర్వాత భూముల స్వాధీనం
అమరావతి: దాదాపు 18 ఏళ్లుగా వివాదాల్లో చిక్కుకున్న బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు కేటాయించిన సుమారు 14 వేల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఉక్కు కర్మాగారం, విమానాశ్రయం ఏర్పాటు కోసం అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం పరిధిలో ఈ భూములను కేటాయించింది. అయితే సంస్థ కేటాయించిన ఉద్దేశానికి అనుగుణంగా ప్రాజెక్టును అమలు చేయకపోవడంతో ప్రభుత్వం భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ.5 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వుల మేరకు రెవెన్యూ అధికారులు భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని వెబ్‌ల్యాండ్, అడంగల్, 1-బి రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. భవిష్యత్తులో ఈ భూములను పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టును 2007లో ఒబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) ప్రమోటర్లు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి ఆధ్వర్యంలో ప్రతిపాదించారు. ఉక్కు కర్మాగారం కోసం 10,700 ఎకరాలు, కమర్షియల్ విమానాశ్రయం, ఫ్లయింగ్ అకాడమీ, విమానయాన అనుబంధ పరిశ్రమల కోసం మరో 3,115 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం, అనంతరం కర్ణాటక అక్రమ గనుల కేసులు, ఆర్థిక సమస్యలు, న్యాయపరమైన చిక్కులతో ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయింది.
ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమీకరణలో భాగంగా బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఈ భూములను యాక్సిస్ బ్యాంకులో తనఖా పెట్టి సుమారు రూ.350 కోట్ల రుణం పొందింది. అనంతరం సంస్థ రుణాలను చెల్లించకపోవడంతో యాక్సిస్ బ్యాంకు సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద రికవరీ చర్యలు ప్రారంభించింది. మరోవైపు, కేటాయించిన షరతులను సంస్థ ఉల్లంఘించిందని ప్రభుత్వం భూములను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు తనకుందని వాదించింది.
దీంతో ప్రభుత్వం, యాక్సిస్ బ్యాంకు మధ్య వివాదం కోర్టులకు చేరి అనేక సంవత్సరాలు న్యాయపోరాటం సాగింది. ప్రభుత్వం ఇప్పటికే 2011లోనే భూములను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, న్యాయవివాదాల కారణంగా అమలు కాలేదు. ఇటీవల వివాదాలు పరిష్కారమవడంతో జిల్లా యంత్రాంగం మొత్తం భూమిని ప్రభుత్వ వశం చేసుకుంది.
దాదాపు రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న ఈ విస్తారమైన భూమి ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ అధీనంలోకి రావడంతో, కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు కేటాయించే అవకాశం ఏర్పడింది. ఇది రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Login
Comments (0)